ఆస్ట్రేలియన్లు ఇకపై తమ జాతీయ గీతాన్ని సరికొత్త తీరులో పాడనున్నారు. ఈ మేరకు తమ జాతీయ గీతంలో మార్పులు చేసినట్లు ప్రకటించారు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్. జనవరి ఒకటి నుంచి కొత్త ఆంథెమ్ అమలులోకి వస్తుందని తెలిపారు. ప్రధాని ప్రకటన ఆశ్చర్యానికి గురిచేసినప్పటికీ.. దాదాపుగా అందరూ స్వాగతించారు.
కొత్త జాతీయ గీతం ప్రకారం ఆస్ట్రేలియాను 'యువ, స్వేచ్ఛాయుతమైన' దేశంగా పిలవబోరు. దేశీయ చరిత్రను ప్రతిబింబించేలా చేసే ప్రయత్నంలో ఈ మేరకు మార్పులు జరిగినట్లు బీబీసీ పేర్కొంది.
ఇకపై 'మేము యువకులం, స్వేచ్ఛగా ఉన్నాము' అనేదానికి బదులుగా 'మేమంతా ఒక్కటే, స్వేచ్ఛగా ఉన్నాము' అని పాడనున్నారు.
జాతీయ గీతంలో మార్పులు చేయటం వల్ల ప్రజల్లో ఐక్యతాభావం పెంపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మోరిసన్.
" యువ, స్వేచ్ఛాయుతమైన అనేదానికి బదులుగా మేమంతా ఒక్కటే అనటంలో పెద్దగా తేడా కనిపించకపోవచ్చు. కానీ అది చాలా పెద్ద మార్పు తీసుకొస్తుందని భావిస్తున్నా. ఒక దేశంగా మా ప్రయాణం గుర్తించదగినది. దేశ చరిత్ర 300కిపైగా జాతులు, భాషా సమూహాల కలయిక. మాది భూమండలంపై అత్యంత విజయవంతమైన బహుళ సాంస్కృతిక దేశం. "
- స్కాట్ మోరిసన్, ఆస్ట్రేలియా ప్రధాని
ఇదీ చూడండి: కిమ్ 'కొత్త' సందేశం- 1995 తర్వాత ఇదే!