ఆస్ట్రేలియాలో కొవిడ్ టీకా సమగ్ర వినియోగానికి అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ పచ్చజెండా ఊపింది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వచ్చే నెలలో ప్రారంభించడానికి ఆ దేశం సిద్ధమవుతోంది.
ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు అభివృద్ధి చేసిన టీకా వినియోగానికి ఆస్ట్రేలియా థెరపెటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ సోమవారం తాత్కాలిక ఆమోదం తెలిపింది. 16 ఏళ్లు ఆ పైబడిన వయస్సు వారు దీన్ని వినియోగించవచ్చని పేర్కొంది. వృద్ధులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందికి ప్రాధాన్య క్రమంలో టీకా అందించాలని స్పష్టం చేసింది.
ఈ టీకా ఆమోదం పొందడం పట్ల ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ హర్షం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వినియోగానికి అత్యవసర ఆమోదం కాకుండా పూర్తిస్థాయిలో అధికారిక అనుమతి ఇచ్చిన తొలిదేశం తమదేనని పేర్కొన్నారు.
140 మిలియన్ల టీకాలు..
అక్టోబర్ నాటికి అందరికీ టీకాలు వేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ మేరకు 10 మిలియన్ల టీకా డోసులను కొనుగోలు చేసేందుకు ఫైజర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 140 మిలియన్ల టీకాలను సమకూర్చుకోనున్నామని ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ సోమవారం తెలిపారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన టీకాకు ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలపగానే.. ఆ సంస్థ నుంచి 53.8 మిలియన్ల టీకాలను అందుకుంటామని చెప్పారు.
ఇప్పటి వరకు ఆ దేశంలో దాదాపు 30,000 కేసులు నమోదయ్యాయి. 900 మంది వైరస్ ధాటికి బలయ్యారు.