పంజ్‌షేర్‌తో పాటు అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకున్నట్లు పేర్కొన్న తాలిబన్లు(Afghanistan Taliban).. అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ప్రకటించారు. ఇదే సమయంలో అఫ్గాన్‌లో ఆంక్షలు, తమను వ్యతిరేకిస్తూ నిరసనలు చేసేవారిపై దాడుల వంటి చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా పంజ్‌షేర్‌లోనూ(Panjshir Valley) తాలిబన్లు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా తాలిబన్లు సృష్టిస్తున్న మారణహోమాన్ని ఆపేందుకు అంతర్జాతీయ సమాజంతోపాటు ఐక్యరాజ్య సమితి ముందుకు రావాలని అక్కడి నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ మొరపెట్టుకుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది.
"ఎన్‌ఆర్‌ఎఫ్ బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారీ ప్రాణనష్టాన్ని చవిచూసిన తర్వాత ఇక్కడి పౌరులను ఊచకోత కోసే ప్రక్రియను తాలిబన్లు మొదలు పెట్టారు. ఈ మారణహోమానికి సరిహద్దులో జరిగిన నేరాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా నిరాయుధులైన సామాన్య పౌరులపై చేస్తున్న దాడులు, హింసాత్మక ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితితో పాటు ఇతర సంస్థలు తాలిబన్ల చర్యలను కట్టడి చేయాలి. అంతేకాకుండా వారికి సహకరిస్తున్న విదేశీ శక్తులను కూడా ఈ నేరాలకు బాధ్యులుగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
-పంజ్‌షేర్ నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్.
ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో ఏర్పడ్డ తాలిబన్(Afghanistan Taliban) తాత్కాలిక ప్రభుత్వం కూడా చట్టవిరుద్ధమైనదేనని నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ మరో ప్రకటనలో పేర్కొంది. వీటికి వ్యతిరేకంగా అఫ్గాన్ ప్రజలు తమ పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చింది.
ఇదిలాఉంటే, విదేశీ బలగాలు అఫ్గాన్‌నుంచి వెళ్లిపోయిన తర్వాత దేశం మొత్తం ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్‌షేర్ మాత్రం కొరకరాని కొయ్యగా మారింది. తాజాగా ఆ ప్రదేశాన్ని కూడా తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు ప్రకటించిన తాలిబన్లు.. అక్కడి నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్(ఎన్‌ఆర్‌ఎఫ్) బలగాలపై విజయం సాధించినట్లు వెల్లడించారు. కానీ, తాలిబన్ల ప్రకటనను మాత్రం ఎన్‌ఆర్‌ఎఫ్ కమాండర్ అహ్మద్ మసూద్ ఖండించారు. ప్రావిన్సులో ఇంకా తాము పోరాటం కొనసాగిస్తున్నామని.. ఆ ముఠాకు వ్యతిరేకంగా దేశమంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఎఫ్ బలగాలపైనే కాకుండా సాధారణ పౌరులపై తాలిబన్లు దాడులకు తెగబడుతున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: తాలిబన్ల ప్రభుత్వంపై ఐరాస కీలక వ్యాఖ్యలు
ఇదీ చూడండి: మా పాలన ఇలా ఉంటుంది... తాలిబన్ల కీలక ప్రకటన