అఫ్గానిస్థాన్‌ను(Afghanistan Taliban) హస్తగతం చేసుకున్న తాలిబన్లు(Taliban) తమ నిజస్వరూపాన్ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. షరియా చట్టాలను(sharia law) అనుసరించి మహిళల హక్కులను గౌరవిస్తామని చెప్పి అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, తమను విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పలువురు మహిళా జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల పని హక్కును తాలిబన్లు గౌరవించాలని వారు కోరుతున్నారు.
విధులు నిర్వర్తించేందుకు కార్యాలయానికి వెళ్లగా తనను అనుమతించలేదని రేడియో టెలివిజన్ అఫ్గానిస్థాన్(ఆర్టీఏ) యాంకర్ షబ్నామ్ ఖాన్ దవ్రాన్ తెలిపారు.
" నేను నా విధుల్లో చేరాలనుకుంటున్నా. కానీ, దురద్రుష్టవశాత్తు వారు నన్ను అనుమతించటం లేదు. ప్రభుత్వం మారిపోయిందని, మీరు పని చేసేందుకు వీలు లేదని వారు నాకు చెప్పారు. "
- షబ్నామ్ ఖాన్ దవ్రాన్, ఆర్టీఏ యాంకర్.
తనను కూడా విధులకు వెళ్లకుండా అడ్డుకున్నారని మరో జర్నలిస్ట్ ఖదిజా తెలిపారు. ' నేను ఆఫీస్‌కు వెళ్లాను, కానీ లోపలకు వెళ్లేందుకు అనుమతించలేదు. ఆ తర్వాత మరికొంత మంది నా తోటి ఉద్యోగులను నిలువరించారు. తాలిబన్లు ఇటీవల నియమించిన కొత్త డైరెక్టర్‌తో మాట్లాడాం. ప్రోగ్రాముల్లో మార్పులు జరిగాయని, వారికి కావాల్సిన కార్యక్రమాలనే ప్రసారం చేస్తారని, మహిళా యాంకర్లు, జర్నలిస్టులకు స్థానంలేదని చెప్పారు' అని తెలిపారు. మహిళల విధులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని తాలిబన్లు చెప్పారని ఖదిజా పేర్కొన్నారు.
కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన తాలిబన్ ప్రతినిధి జుబిహుల్లా ముజాహిద్ మహిళల హక్కులపై పలు హామీలిచ్చారు. ఇస్లామ్‌ను అనుసరించి వారి హక్కులను గౌరవిస్తామని తెలిపారు. ఆరోగ్యం సహా ఇతర రంగాల్లో వారి అవసరం ఉన్న చోట్ల అనుమతిస్తామని చెప్పారు. మహిళల పట్ల వివక్ష ఉండబోదన్నారు. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
ఇదీ చూడండి: తాలిబన్ల అకృత్యాలతో భయం భయంగా అఫ్గాన్ ప్రజలు!