అఫ్గానిస్థాన్లో మరోసారి బాంబు దాడులు కలకలం రేపాయి. అధ్యక్ష భవనానికి సమీపంలో వెంటవెంటనే మూడు సార్లు రాకెట్ దాడులు జరిగాయి. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. ఈద్ అల్-అదా పర్వదినం సందర్భంగా ప్రసంగించాల్సి ఉండగా.. అంతకు కొద్దిసేపటి ముందే ఈ దాడులు జరగటం గమనార్హం.
అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అధ్యక్ష భవనం బయటే రాకెట్లు కూలినట్లు వెల్లడించారు. రాకెట్లు పడిన చోట పార్క్ చేసి ఉంచిన ఓ కారు, సమీపంలోని కాలనీల్లోని భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.
లాంచింగ్ ప్యాడ్ ఉపయోగించి రాకెట్ దాడులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇది తాలిబన్ల పనేనని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ గ్రూపూ ఇంకా ప్రకటన విడుదల చేయలేదు.
తాలిబన్లపై మండిపాటు..
ఈ దాడులపై స్పందించిన అష్రఫ్ ఘనీ.. తాలిబన్లకు శాంతి నెలకొల్పే ఉద్దేశం లేదని మండిపడ్డారు. తాము శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నామని.. ఇందుకోసం త్యాగాలకు కూడా సిద్ధమేనని నిరూపితమైందని పేర్కొన్నారు.
మరోవైపు వరుస దాడులతో అఫ్గాన్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ భద్రతా దళాల ఉపసంహరణ, తాలిబన్లు పరిధి పెరుగుతుండటం వంటి పరిణామాలతో.. మరింత విధ్వంసకర పరిస్థితులు రావచ్చని భయపడుతున్నారు.
ఇదీ చదవండి:మార్కెట్లో బాంబు పేలుడు- 30 మంది మృతి