అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో ఓ పాఠశాల సమీపంలో బాంబు పేలింది. ఈ ఘటనలో 30మంది మృతి చెందారు. అందులో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు అఫ్గాన్ ప్రభుత్వం తెలిపింది. మరో 50మంది తీవ్రంగా గాయపడ్డట్లు పేర్కొంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రి గులాం దస్తగిర్ నాజరి తెలిపారు.
పేలుడు జరిగిన వెంటనే అక్కడికి అంబులెన్సులు వెళ్లాయని అఫ్గాన్ మంత్రి తారీఖ్ అరియాన్ తెలిపారు. అయితే అంబులెన్సులను అడ్డుకుని ప్రజలు దాడులకు తెగబడ్డారని ఆ దేశ ఆరోగ్య మంత్రి గులాం దస్తగిర్ నాజరి అన్నారు. వారిని సముదాయించి అంబులెన్సులు వెళ్లేలా చేశామన్నారు.
కాగా దాడులకు పాల్పడింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే ఇటీవల అదే ప్రాంతంలో షీతేస్ మైనార్టీలపై దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పాఠశాలపై జరిగిన దాడిని అఫ్గాన్ ప్రభుత్వం ఖండించింది.
అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు తమ దేశానికి పయనమైన మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.