ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తూనే ఉంది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 39.47లక్షలకు పైగా వైరస్ కేసులు బయటపడ్డాయి. 2.71లక్షల మంది మరణించారు. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 13.58లక్షల మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు.
రష్యాలో 2లక్షలకు చేరువలో కేసులు
రష్యాలో కరోనా వైరస్ రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. ఇవాళ ఒక్కరోజే 10,699 మందికి వైరస్ సోకడం వల్ల ఆ దేశంలో కొవిడ్-19 బాధితులు లక్షా 87 వేల 859కి చేరుకుంది. మరో 98 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,723కు పెరిగింది. 26,608 మందిలో వైరస్ నయమైంది.
అమెరికాలో మరో 68 మంది బలి
కరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం కుదేలవుతోంది. ఇవాళ ఇప్పటివరకు మరో 1,270 కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 13 లక్షలకు చేరువలో ఉన్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. అక్కడ ఇప్పటి వరకు 76 వేల మంది మృతి చెందారు.
స్పెయిన్‌లో 229 మంది మృతి
స్పెయిన్‌లో కరోనా కట్టడి చర్యలు చేపట్టినప్పటికీ.. మరణాలు మాత్రం ఆగట్లేదు. ఇవాళ 229 మంది మృతి చెందినట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. మరో 3,262 మందికి వైరస్ సోకినట్లు తెలిపింది. దీంతో ఆ దేశంలో మొత్తం కొవిడ్-19 బాధితుల సంఖ్య 2,60,117కు చేరింది. వీరిలో 1,68,408 మంది ఆసుపత్రి నుంచి కోలుకున్నారు.
మెక్సికోలో రెండు వేల కేసులు
మెక్సికోలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతోంది. ఇవాళ దాదాపు 2వేల మందికి వైరస్ సోకినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. మరో 257 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,961కి చేరింది. దేశంలో 29,616 మంది మహమ్మారి బాధితులు ఉండగా.. 17,781 మంది ఆసుపత్రి నుంచి కోలుకున్నారు.
పాకిస్థాన్‌ను కుదిపేస్తున్న కరోనా
పాకిస్థాన్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1764 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశవ్యాప్తంగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 25,837కు చేరినట్లు పాకిస్థాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ మహమ్మారి కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల మృతుల సంఖ్య 599కి పెరిగినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 7,530 మంది కరోనా వైరస్ బారినుంచి కోలుకున్నారు.
సౌదీ అరేబియాలో 229 మంది మృతి
సౌదీ అరేబియాలో గత 24 గంటల్లో 1,701 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 10 మృతి చెందారు. దీంతో ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 229కి చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 35,432 మంది బాధితులు ఉండగా... 9,120 మంది రికవరీ అయ్యారు.
ఇరాన్లో 24 గంటల్లో 1,556 కేసులు
ఇరాన్లో రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 1,556 కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య లక్షా 4 వేలకు పెరిగింది. ఇప్పటి వరకు 6వేల 541 మంది ప్రాణాలు కోల్పోయారు.
సింగపూర్‌లో వైరస్ ప్రతాపం
సింగపూర్‌లో వైరస్ విజృంభిస్తూనే ఉంది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 768 మందికి వైరస్ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 21 వేలు దాటినట్లు అధికారులు వెల్లడించారు. కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు మాత్రం తక్కువగా ఉంది. ఇప్పటి వరకు అక్కడ 20 మంది మాత్రమే మహమ్మారికి బలయ్యారు.
బెల్జియంలోనూ పెరుగుతున్న కేసులు
బెల్జియంలో రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే 591 మందికి వైరస్ సోకిన కారణంగా ఆ దేశంలో మొత్తం 52,011 మందికి వైరస్ సోకింది. శుక్రవారం ఒక్కరోజే 106 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 8,521 మంది మరణించారు.
నెదర్లాండ్‌లో 5 వేలు దాటిన మరణాలు
నెదర్లాండ్‌లో కరోనా ఉద్ధృతికి అడ్డుకట్ట పడటం లేదు. గడిచిన 24 గంటల్లో 319 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. దీంతో బాధితుల సంఖ్య 42,093కు పెరిగింది. వీరిలో 5,359 మంది వైరస్‌కు బలయ్యారు.
అఫ్గానిస్థాన్ ఆరోగ్య మంత్రికి కరోనా
అఫ్గానిస్థాన్ ఆరోగ్య మంత్రికి కరోనా వైరస్ సోకినట్లు అ దేశ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,700 మంది వైరస్ బారిన పడగా... 100 మంది మృత్యువాతపడ్డారు.