అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు(Afghan Crisis) తమవశం చేసుకున్న తర్వాత అక్కడి పరిస్థితులు మెల్లమెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. గురువారం వరకు నిలిచిపోయిన విమాన సేవలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. అప్గాన్‌లో దేశీయ విమానసేవలు శుక్రవారం మొదలైనట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఆ దేశానికి చెందిన అరియానా ఎయిర్‌లెన్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు పేర్కొంది.
అఫ్గాన్‌ను అమెరికా దళాలు వీడిపోయిన తర్వాత కాబుల్ విమానాశ్రయం(Kabul Airport) సహా దేశం మొత్తాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు తాలిబన్లు. దేశంలో విమానసేవలు సాధారణ స్థితికి చేరుకుంటాయని తాలిబన్లు మంగళవారమే ప్రకటించారు. గురువారం కతర్ మిలిటరీకి చెందిన విమానం కూడా కాబుల్ విమానాశ్రయంలో ఎగిరింది.
వెస్టర్న్ యూనియన్ సేవలూ..
అఫ్గాన్‌లో త్వరలోనే వెస్టర్న్ యూనియన్ సంస్థ కార్యకలాపాలనూ పునురద్ధరించనున్నట్లు తాలిబన్లు తెలిపారు. ఆగస్టు 15న తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత అఫ్గాన్‌లో సేవలను నిలిపివేసింది అమెరికాకు చెందిన ఈ సంస్థ. విదేశాల్లో ఉండే వారు తమ బంధువులకు నగదు బదిలీ చేసేందుకు ప్రధానంగా వెస్టర్న్ యూనియన్ సేవలు వినియోగించుకుంటారు.
ప్రస్తుతం నగదు లేక బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు అఫ్గాన్ ప్రజలు. వారానికి రూ.15వేలు మాత్రమే విత్‌డ్రా చేయాలని తాలిబన్ల విధించిన ఆంక్షల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా నిర్ణయాన్ని విదేశాల్లోని అఫ్గాన్ వాసుల బంధవులు స్వాగతించారు.
ఇదీ చదవండి:Taliban on Kashmir: కశ్మీర్‌పై మాట మార్చిన తాలిబన్లు!