ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ రోజురోజుకీ తీవ్రమవుతోంది. రాయిటర్స్ లెక్కల ప్రకారం గత 100 గంటల్లో 10 లక్షల కేసులు నమోదుకావడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. చైనాలోని వుహాన్‌లో డిసెంబరు ఆఖర్లో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి క్రమంగా ప్రపంచాన్ని చుట్టుముట్టింది. జులై 13 నాటికి 1.30 కోట్ల కేసులు నమోదుకాగా.. కేవలం నాలుగు రోజుల్లోనే ఆ సంఖ్య 1.4 కోట్లకు చేరడం కరోనా ఉద్ధృతికి అద్దంపడుతోంది.
కేసుల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటి వరకు 36 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇంకా కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజు అమెరికాలో 77 వేల కేసులు నమోదయ్యాయి. ఇది స్వీడన్ దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులతో సమానం. అయినా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కరోనా కట్టడి నిబంధనల విషయంలో అధ్యక్షుడు ట్రంప్ సహా అనేక మంది అలసత్వం ప్రదర్శిస్తుండడం గమనార్హం. పైగా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ పేరిట వైరస్‌ను అరికట్టే నిబంధనల్ని మరింత నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఐరోపా దేశాల్లో...
ఇక వైరస్‌తో ఓ సమయంలో అల్లాడిపోయిన ఐరోపా దేశాల్లో పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంటోంది. కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతోంది. స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షల్ని దాదాపు ఎత్తివేశారు. అయినా, కొన్ని ప్రాంతాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తుండడంతో బార్సిలోనా వంటి నగరాల్లో స్థానికంగా ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తున్నారు.
ఆరు లక్షలకు చేరువలో...
అధికారిక వివరాల ప్రకారం.. కరోనా వైరస్ బారిన పడి వుహాన్‌లో జనవరి 10న తొలి వ్యక్తి మరణించారు. ఆ తర్వాత అదే నగరంలో మృతులు, కేసుల సంఖ్యగా ఒక్కసారిగా పెరిగింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య ఆరు లక్షలకు చేరువైంది. వివిధ దేశాల అధికారిక నివేదికల ప్రకారం కేసుల సంఖ్యను మదింపు చేస్తున్న రాయిటర్స్ లెక్కలను బట్టి చూస్తే.. ఉభయ అమెరికా ఖండాల్లో కేసులు భారీ స్థాయిలో ఎగబాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసులు, మరణాల్లో సగానికిపైగా ఈ దేశాల్లోనే నమోదయ్యాయి. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 20 లక్షల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 76 వేల మందికి పైగా మరణించారు.
పరీక్షలు జరగటం లేదు....
ఇక కేసుల పెరుగుదలలో ముందు వరుసలో ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. గత కొన్ని రోజులుగా దేశంలో సగటున 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2,37,743 కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. వీటిలో అత్యధిక కేసులు అమెరికా, బ్రెజిల్, భారత్ నుంచే నిర్ధారణ కావడం గమనార్హం. అయితే, ఇంకా చాలా దేశాల్లో పరీక్షలు సాఫీగా సాగడం లేదని.. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల కంటే వాస్తవ సంఖ్య ఇంకా భారీ స్థాయిలో ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి:అమెరికాలో మరోసారి షట్‌డౌన్ తప్పదేమో!