తైవాన్‌లోని 'ఎక్స్పార్క్ కోజీ బ్లూ' హోటల్.. ప్రపంచంలోని ప్రత్యేక నిర్మాణాల్లో ఒకటి. సముద్ర వాతావరణాన్ని తలపించే ఈ హోటల్లో అక్వేరియం పెద్ద ఆకర్షణ. రకరకాలైన సముద్ర జీవులు గాజుగదుల్లో తిరుగుతూ అతిథులకు స్వాగతం పలుకుతాయి.
పెంగ్విన్ల ఆటలు..
హోటల్ ప్రవేశద్వారం నుంచే సముద్ర జీవులు దర్శనమిస్తాయి. రకరకాల చేపలు, పెంగ్విన్లు ఒక చోట నుంచి మరొక చోటుకు తిరుగుతూ కనువిందు చేస్తాయి. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పెంగ్విన్ల ఆటలు. సాధారణంగా మంచు ప్రాంతాల్లో కనిపించే పెంగ్విన్లు.. ఈ అక్వేరియం నీటిలో సరదాగా ఆడుకుంటూ చూపరుల మనసు దోచేస్తాయి. అందుకే వీక్షకులు ఈ హోటల్‌కు వెళ్లేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. మరి విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ జంతువులను కంటికిరెప్పలా చూసుకుంటూ.. వాటి పరిరక్షణకూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వాహకులు.
ఇలాంటి హోటల్ చూడటం ఇదే మొదటిసారి. అక్వేరియంలో పెంగ్విన్‌లు ఈత కొట్టడం చూస్తుంటే ఆనందంగా ఉంది. నిజంగా ఈ హోటన్ చాలా ప్రత్యేకమైంది. ఈ పర్యటనను చాలా ఎంజాయ్ చేశాను.
-- చు, పర్యటకురాలు
నవల ఆధారంగా నిర్మాణం..
ఈ హోటల్‌ను ఫ్రెంచ్ నవల 'ట్వంటీ థౌజెండ్ లీగ్స్ అండర్ ది సీ' ఆధారంగా నిర్మించారు. నవలలో ఉండే ప్రత్యేక అంశాలను ఆసరాగా చేసుకొని దీనికి రూపకల్పన చేశారు. హోటల్లోని ప్రతీ గదిని.. ఆ పుస్తకంలో పొందుపర్చిన కొలతలకు తగ్గట్టుగానే నిర్మించారు. గోడల మీద ఉండే కళాఖండాలు కూడా సముద్రానికి సంబంధించినవే ఉంటాయి.
'ట్వంటీ థౌజెండ్ లీగ్స్ అండర్ ది సీ' అనే ఫ్రెంచ్ నవల ఆధారంగా హోటల్ రూపొందించాం. హోటల్ ప్రతి మూలను సముద్రంతో సంబంధం ఉన్న వాటితోనే అలంకరించాం. బెడ్‌రూమ్‌లలో 65 అంగుళాల టీవీ స్క్రీన్ ఉంటుంది. అందులో సొరచేపలు, మాంటారేస్లు సరదాగా తిరగుతూ ఉండడం లైవ్‌లో చూడొచ్చు.
-సాండ్రాయు, కోజీ బ్లూ ప్రతినిధి.
టీవీ ద్వారా లైవ్..
చూడడానికి ఎంతో చక్కగా ఉండే ఈ సముద్ర జీవుల సమూహాన్ని హోటల్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంటారు. అతిథుల కోసం ప్రత్యేక ఛానల్లో వాటి ఆటలను ప్రత్యక్షప్రసారం చేస్తుంటారు.
"హోటల్లో ఉన్నప్పుడు సముద్రంలో ఉన్న భావన ఉంటుంది. భవంతి నిర్మాణం అలానే చేశాం. పెంగ్విన్ల విన్యాసాలు ఇక్కడ చూడొచ్చు. అవి నీటిలో, భూమి మీద జీవించేందుకు అనువుగా ఏర్పాట్లు ఉన్నాయి. పెంగ్విన్లు సొరంగ మార్గం ద్వారా వెళ్లేప్పుడు అతిథులు చూడొచ్చు.
-ఎథీనా కు, కోజీ బ్లూ ప్రతినిధి.
హోటల్ బిల్లు ఎక్కువే..
ఇంత గొప్పగా నిర్మించిన ఈ హోటల్లో గడపడానికి ఎక్కువగానే వెచ్చించాలి. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి. కోజీ బ్లూ హోటల్లో ఒకరాత్రి ఉండాలంటే కనీసం రూ. 13వేలు చెల్లించాలని నిర్వాహకులు చెబుతున్నారు.