ఒకవైపు తీవ్ర విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న చైనాను మరోవైపు వరదలు (China Floods Latest ) ముంచెత్తుతున్నాయి! తాజాగా భారీ వర్షాలతో ఉత్తర చైనాలోని షాంక్సీ ప్రావిన్స్ అతలాకుతలం అవుతోంది. వరదల కారణంగా ఇప్పటికే స్థానిక జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రావిన్స్‌వ్యాప్తంగా 76 నగరాలు, జిల్లాల్లోని దాదాపు 17.5 లక్షల జనాభాపై వరదల ప్రభావం పడినట్లు అత్యవసర నిర్వహణ విభాగం వెల్లడించింది. ఈ క్రమంలో దాదాపు 1.20 లక్షల మందిని వరద ప్రభావిత ప్రాంతాలనుంచి ఖాళీ చేయించి, సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు తెలిపింది.
మరోవైపు వర్షాల ధాటికి దాదాపు 1.90 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 17 వేలకు పైగా ఇళ్లు కూలిపోయాయి. బాధితులకు తక్షణ ఉపశమనం కోసం అత్యవసర నిర్వహణ విభాగం దాదాపు 4 వేల టెంట్‌లు, 3,200 పడకలతోపాటు దుస్తులు, దుప్పట్లు సమకూర్చింది. ఇదిలా ఉండగా దేశంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాంతం ఇదే కావడం గమనార్హం. విద్యుత్ కొరతకు పరిష్కారంగా ఇటీవలే చైనా స్థానికంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే! ఈ మేరకు గనులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ.. వరదల ధాటికి ఇప్పటికే పెద్ద ఎత్తున బొగ్గు గనులు మూతబడినట్లు సమాచారం.
ఇదీ చూడండి: ఎగిరిన కాసేపటికే కుప్పకూలిన విమానం.. 15 మంది దుర్మరణం