ఫిలిప్పీన్స్‌లో 'వామ్కో' తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఇప్పటివరకు 39 మంది మరణించారు. మరో 32 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా నదులు ఉద్ధృతంగా ప్రవహించి.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లు పూర్తిగా మునిగిపోవడం వల్ల ప్రజలు మిద్దెలపైకి పరుగులు తీశారు. 2 లక్షల 70 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో 30 లక్షల 80 వేలమంది నిరాశ్రయులయ్యారు.
తుపాను కారణంగా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. ఫలితంగ లక్షలాదిమంది అంధకారంలో మగ్గుతున్నారు. వందలాది చెట్లు నెలకొరిగాయి. రహదారులు కొట్టుకుపోగా.. పలు వంతెనలు కుప్పకూలిపోయాయి. వరద ప్రభావం తగ్గిన కొన్ని చోట్ల మౌలిక సదుపాయాల పునరుద్ధరణలో తలమునకలయ్యారు. సిబ్బంది.
సహాయక చర్యలకు రంగంలోకి దిగిన మిలటరీ బలగాలు... విపత్తు నిర్వహణ సిబ్బందితో కలిసి వేలాది మందిని రక్షించాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 3 లక్షల 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన సిబ్బంది.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఆ దేశ సైన్యాధ్యక్షుడి నేతృత్వంలో సంబంధిత అధికారులతో వరదలపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: ఫిలిప్పీన్స్‌ను వణికిస్తోన్న 'వామ్కో' తుపాను