Pakistan Blast Peshawar: పాకిస్థాన్ పెషావర్‌లోని ఓ మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 56 మంది చనినిపోయారు. దాదాపు 194 మందికి గాయాలయ్యాయి. శుక్రవారం మసీదు చాలా రద్దీగా ఉండడం కారణంగా ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కిస్సా ఖ్వానీ బజార్లో ఉండే జామియా మసీదులో భక్తులు శుక్రవారం ప్రార్థనలు చేస్తున్నప్పుడు బాంబు పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఇస్లామిక్ స్టేట్ పనే..
ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది ఇస్లామిక్ స్టేట్. ఈ మేరకు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి.
పేలుడుకు ముందు ఇద్దరు దుండగులు ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించేందుకు యత్నించారని పోలీసులు పేర్కొన్నారు. వారిని అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపగా ఓ అధికారి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మరో అధికారి పరిస్థితి విషమంగా ఉందని వివరిచారు. ఆ తర్వాత కాసేపటికే పేలుడు సంభవించినట్లు తెలిపారు.