చైనాను అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. హెనాన్ ప్రావిన్స్‌లో గత 1000ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కుంభవృష్టి కురవడం వల్ల భీకర వరదలు సంభవించాయి. ఫలితంగా 25 మంది చనిపోగా.. మరో ఏడుగురు గల్లంతయ్యారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులున్నారు. ఓ రైల్వే స్టేషన్లోకి ఒక్కసారిగా వరద నీరు ప్రవేశించడం వల్ల వారంతా చనిపోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
12 లక్షల మందిపై ప్రభావం
హెనాన్ ప్రావిన్స్‌లోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. మొత్తం 12.4 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. దీంతో సహాయక చర్యల కోసం సైన్యాన్ని రంగంలోకి దించాలని అధికారులను ఆదేశించారు దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్. విపత్తు నిర్వహణ బృందాలతో పాటు రంగంలోకి దిగిన సైన్యం.. లక్షా 60 వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
కాగితపు పడవల్లా...
వరద ప్రవాహంతో డెంగ్‌ఫెంగ్ నగరం.. నదిని తలపిస్తోంది. వ్యాపార సముదాయల వద్ద నిలిపి ఉంచిన వందలాది వాహనాలు వరదలో మునిగి.. పైభాగం మాత్రమే కనిపిస్తున్నాయి. బాధితులను లైఫ్‌బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా ప్రాంతాల్లో నివాసాలు, వ్యాపార సంస్థల ముందు పార్క్ చేసిన కార్లు.. కాగితపు పడవల్లా వరదలో కొట్టుకుపోయాయి.
ఒక్కరోజే 457.5 మిల్లీమీటర్లు వర్షపాతం
'ఐఫోన్ సిటీ'గా పిలిచే హెనాన్ రాజధాని జెంగ్జౌలో మంగళవారం ఒక్కరోజే 457.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శనివారం నుంచి ఇక్కడ సగటున 640.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 1000 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి అని అక్కడి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ప్రావిన్స్‌లో ఫ్యాక్టరీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
260 విమానాలు రద్దు
వరద ప్రభావం 12 ప్రధాన నగరాలపై పడింది. రోడ్లపై వరద నీరు చేరడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బస్సు, రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. రహదారులను మూసేశారు. దాదాపు 260కి పైగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. జెంగ్జౌలోని ఓ సబ్‌వే టన్నెల్‌లోకి వరద నీరు భారీగా చేరగా.. అందులో నుంచి వెళ్తోన్న రైల్లోకి నీరు వచ్చింది. దీంతో పలువురు రైల్లో చిక్కుకుపోయారు. ఛాతీ వరకు నీటిలో నిల్చున్న ప్రయాణికుల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సహాయకచర్యలు చేపట్టిన అధికారులు ప్రయాణికులను టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రపంచంలోనే హైస్పీడ్ రైలు- చైనా ఘనత