సౌదీలో 2 లక్షల ఏళ్ల నాటి పురాతన రాళ్లు బయటపడ్డాయి. అల్- ఖాసిం ప్రాంతంలోని షోయబ్ అల్- అద్ఘామ్లో.. మధ్య రాతియుగం నాటి రాతిగొడ్డలి సహా ఇతర రాతి ఉపకరణాలను కనుగొన్నారు. ఈ మేరకు.. అక్కడి అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన, అరుదైన రాతి గొడ్డళ్లను అప్పట్లో ప్రజలు రోజువారీ వినియోగంలో భాగంగా సృష్టించుకున్నారని తెలిపారు.
ఇక్కడ కనుగొన్న రాతి పనిముట్లు ఆ ప్రాంతంలో నివసించిన సమృద్ధ జనసాంద్రతను సూచిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇంకా అరేబియా ద్వీపకల్పంలోని వాతావరణ పరిస్థితులు అప్పటి జనజీవనానికి అనుకూలంగా ఉన్నట్లు సంకేతాలు ఉన్నాయని తెలిపారు. అక్కడ లభించే సహజ వనరుల నుంచి వారెంతో ప్రయోజనం పొందినట్లు సౌదీ గెజిట్ నివేదించింది.
అరేబియా ద్వీపకల్పంలోని అంతర్గత ప్రాంతాలకు చేరుకునేందుకు అప్పటి ప్రజలు నదులను ఉపయోగించేవారని శాటిలైట్ చిత్రాలు ధ్రువీకరించాయి. షుయబ్ అల్-అడ్ఘామ్, ఇతర ప్రాంతాలు.. నదుల మార్గాలతో అనుసంధానించి ఉన్నాయని సౌదీ అధికారులు పేర్కొన్నారు.
వాతావరణంలో మార్పులు..
అప్పటి పర్యావరణ, సాంస్కృతిక సమాచారాన్ని.. పెద్దమొత్తంలో సేకరించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీని ప్రకారం.. వాతావరణంలో గణనీయమైన మార్పులు ఉన్నాయని తేలినట్లు స్పష్టం చేశాయి.
చరిత్రపూర్వ కాలంలో అరేబియా ద్వీపకల్పం అంతటా నదులు, సరస్సులు ఉండేవి. కాలక్రమేణా ఇది.. మానవ సమూహాల వ్యాప్తి, విస్తరణకు దారితీసింది. బాబ్ అల్-మందాబ్ జలసంధి, సినాయ్ ద్వీపకల్పం కారిడార్ల నుంచి.. ఈ మానవ సమూహాల వలసలు జరిగాయని ప్రధానంగా నమ్ముతున్నారు.
ఇదీ చూడండి: కిమ్ 'కొత్త' సందేశం- 1995 తర్వాత ఇదే!