చైనాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు (China Flood News) ఆ దేశానికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఉత్తర చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలకు 15 మంది మృతి చెందగా.. ముగ్గురు గల్లంతైనట్టు అధికారులు వెల్లడించారు. వరద ముంపు నేపథ్యంలో ఆ ప్రావిన్స్‌లోని దాదాపు 1.20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు (China Flood News) తరలించినట్టు పేర్కొన్నారు. అక్టోబర్ 2 నుంచి 7వరకు రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి దాదాపు 10 లక్షల మందికి పైగా జనం ప్రభావితమైనట్టు అధికారులు తెలిపారు. ఈ వర్షాలకు 2,36,460 హెక్టార్లలో పంటలు నాశనం కావడం సహా 37,700 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే, 6021 కి.మీల మేర రహదారులు కూడా దెబ్బతిన్నాయి. దీంతో చైనాకు 780 మిలియన్ డాలర్ల మేర ప్రత్యక్షంగా ఆర్థికనష్టం వాటిల్లినట్టు చైనా అధికార మీడియా సంస్థ జిన్హువా పేర్కొంది.
శుష్క ప్రాంతంగా ఉన్న షాంక్సీ ప్రావిన్స్‌లో నెల ప్రారంభంలో కురిసే సాధారణ వర్షపాతం (China Flood News) కన్నా ఐదు రెట్లు ఎక్కువగా నమోదు కావడం వల్ల పలు ఆనకట్టలు, రైల్వే లైన్లు దెబ్బతిన్నాయని తెలిపింది. ప్రధానంగా బొగ్గు ఉత్పత్తి కేంద్రంగా ఉండే ఈ ప్రాంతంలో 60 బొగ్గు గనులు మూతపడ్డాయి. ప్రస్తుతం విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ఈ గనులు మూతపడటంతో ఇంధన సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల నిమిత్తం అధికారులు 7.8 మిలియన్ డాలర్ల మొత్తాన్ని కేటాయించారు.
ఉత్తర చైనా హెబీ రాష్ట్రంలోని షీజియాజువాంగ్ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి : పండుగ పూట విషాదం- 32 మంది దుర్మరణం