శ్రీలంకలో మరో బాంబు పేలింది. కొలంబొలో జరిగిన కొత్త దాడిలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఉదయం నుంచి ఇప్పటివరకు మొత్తం 7 చోట్ల బాంబు దాడులు జరిగాయి. ఈ పేలుళ్లకు మొత్తం 162 మంది బలయ్యారు. 450మందికిపైగా గాయపడ్డారు.
తేరుకునేలోపే....
ఈస్టర్ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులే లక్ష్యంగా దుండగులు మారణహోమానికి తెగబడ్డారు. ఉదయం మొత్తం 6 ప్రాంతాల్లో బాంబులు పేల్చారు. ఈ దాడుల్లో 160 మంది మరణించారు. 450మందికిపైగా గాయపడ్డారు. సహాయ చర్యలు కొనసాగుతుండగానే... మరోచోట దాడి జరిగింది.
ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు బాధ్యత ప్రకటించుకోలేదు.
హృదయ విదారకం...
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో కొలంబోలోని ఒక చర్చితోపాటు 3 ఐదు నక్షత్రాల హోటళ్లలో బాంబులు పేలాయి. కొలంబోలోని సెయింట్ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్, బట్టికలోవాలోని చర్చిలో దాడులు జరిగాయి.
బట్టికలోవ చర్చిలో ఈస్టర్ సందర్భంగా జరుగుతున్న ప్రార్థనల్లో భారీ సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగిన పేలుడులో మృతిచెందిన వారిలో అత్యధికులు పిల్లలే.
చనిపోయిన వారి బంధువులు, క్షతగాత్రుల రోదనలతో పెను విషాదం అలుముకుంది. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు పేలుళ్ల వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
హెచ్చరించినా...
వరుస పేలుళ్లకు 10 రోజుల ముందే శ్రీలంక పోలీస్ చీఫ్ పుజుత్ జయసుందర దాడిపై హెచ్చరించారు. నిఘా వర్గాల సమాచారాన్ని ఏప్రిల్ 11న అధికారులకు పంపారు. ప్రఖ్యాత చర్చిలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగే అవకాశముందన్నారు. ఎన్టీజే (నేషనల్ థోవీత్ జమాత్) శ్రీలంకలో ఆత్మాహుతి దాడికి పాల్పడే అవకాశముందని ఓ విదేశీ నిఘా సంస్థ హెచ్చరించింది.
అధ్యక్షుడి దిగ్భ్రాంతి...
పేలుళ్లపై శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. ప్రభుత్వ అత్యవసర సమావేశానికి నిర్ణయించారు.
భారత్...
ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సానుభూతి ప్రకటించారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి క్రూరమైన దాడులను సహించేది లేదన్నారు మోదీ.
శ్రీలంకలోని బాంబు పేలుళ్ల ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. ఈ ఘటనపై శ్రీలంకలోని భారత రాయబారితో మాట్లాడామన్నారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తున్నామని తెలిపారు. శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం భారత పౌరుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది.
- ఇదీ చూడండి: 'పోలింగ్ కేంద్రాలకు రానివారి ఓట్లు వేసేయండి'