Singapore boy hungry: సింగపూర్‌కు చెందిన 10 ఏళ్ల డేవిడ్ సూ.. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఎంత తిన్నా ఆకలి తీరకపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. భవిష్యత్‌లో ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని అతడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఏంటీ అరుదైన వ్యాధి?
కడుపు నిండా పౌష్టికాహారం తిన్నా.. ఆకలి ఏమాత్రం తీరకుండా, ఇంకా ఏదో తినాలని అనిపిస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఆలోచన అర గంట, గంట కాదు.. రోజంతా ఉంటే? డేవిడ్ సూ పరిస్థితి ఇదే. అతడు ఎంత తిన్నా.. కడుపు నిండదు. 'ఇంకా తినాలి' అనే అంటుంది అతడి మెదడు. ఈ అరుదైన వ్యాధిని ప్రేడర్ విల్లీ సిండ్రోమ్ అంటారు. ఇదొక జన్యుపరమైన సమస్య. క్రోమోజోమ్ 15లోని కొన్ని జీన్స్ సరిగా పనిచేయకపోవడమే ప్రేడర్ విల్లీ సిండ్రోమ్‌కు కారణం. దీనికి చికిత్స లేదు.
Hungry disease:
తింటూనే ఉంటే ఏమవుతుంది?
కొద్దిరోజులు డైటింగ్ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు తింటే ఏమవుతుందో మనకు బాగా తెలుసు. ముందు బరువు పెరుగుతుంది. తర్వాత అనేక సమస్యలు వస్తాయి. ప్రేడర్ విల్లీ బాధితుల్లో ఇవి మరింత ఎక్కువ. నియంత్రణ లేకుండా అసాధారణ పరిమాణంలో ఆహారం తీసుకుంటే జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. ఇలా ఇప్పటికే కొందరు ప్రేడర్ విల్లీ బాధితుల పేగులకు చిల్లులు పడిన దాఖలాలు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ టిష్యూ నెక్రోసిస్, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రోపరేసిస్ వంటి ఇబ్బందులు వస్తాయి.
ఈ అసాధారణ ఆకలి వల్ల మానసిక సమస్యలూ తలెత్తుతాయి. తింటూనే ఉండాలన్న కోరికను నియంత్రించుకోవడం వారికి పెద్ద సవాలే. సరైన పర్యవేక్షణ లేకపోతే ప్రేడర్ విల్లీ సిండ్రోమ్ బాధితులు శరీరానికి హానిచేసే ప్రమాదకరమైన, పాడైపోయిన ఆహారాన్ని తీసుకునే ఆస్కారముంది. బాధిత చిన్నారులు ఆహారాన్ని దాచి పెట్టుకోవడం, దొంగిలించడం, లేదా తిండి కోసం డబ్బులు దొంగతనం చేయడం వంటి పనులు చేసే అవకాశముందని ఓ నివేదికలో పేర్కొంది రేర్డిసీజెస్.ఓఆర్జీ.
10 year old boy rare genetic condition
ప్రస్తుతం డేవిడ్ పరిస్థితి ఏంటి?
డేవిడ్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది అతడి కుటుంబం. ముఖ్యంగా అతడి బరువును అదుపులో ఉంచడంపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం కొన్ని కఠిన చర్యలు తీసుకుంటోంది. డేవిడ్ ఇష్టారీతిన తినకుండా చూసేందుకు వంట గదికి తాళం వేస్తున్నారు అతడి తల్లిదండ్రులు. ఎప్పుడు ఏం తినాలో స్పష్టమైన షెడ్యూల్ రూపొందించి, డేవిడ్ దానికి కట్టుబడి ఉండేలా చూస్తున్నారు.
డేవిడ్ బరువు అదుపులో ఉన్నంత వరకు భయపడాల్సిందేమీ లేదు. అతడి ఆయుష్షు, ఇతర అంశాలు సాధారణ వ్యక్తుల్లానే ఉంటాయి. కానీ.. ఏదో ఒకటి తింటూనే ఉండాలన్న కోరికను నియంత్రించుకోవడమే అతడికి జీవితకాలపు సవాల్. ఆ విషయంలో ఇప్పుడు కుటుంబం అండగా ఉన్నా.. మున్ముందు స్వీయ నియంత్రణ తప్పనిసరి.
ఇదీ చదవండి: టీచర్‌పై ఐదేళ్ల విద్యార్థి దాడి.. ప్రాణాపాయంలో మహిళ