భీకర అంపన్ తుపాను ధాటికి బంగ్లాదేశ్ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటి వరకు కనీసం 10 మంది వరకు మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది చెట్లు, ఇళ్ల గోడలు కూలి మరణించినట్లు అధికారులు గుర్తించారు.
"తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశాం. వైద్య సౌకర్యలు కల్పిస్తున్నాం. తుపాను వల్ల కనీసం 10 మంది వరకు మరణించి ఉంటారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆరుగురు మృతులను గుర్తించగలిగాం."
- ఆయేషా అక్తర్, బంగ్లాదేశ్ ఆరోగ్య శాఖ అధికారి
భారీ ఆస్తి నష్టం
భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షాల వల్ల చాలా తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయని... అనేక ఇళ్లు దెబ్బతిన్నాయని, తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు వెల్లడించారు.
సురక్షిత ప్రాంతాలకు తరలింపు..
తుపాను హెచ్చరికలతో అప్రమత్తమైన బంగ్లాదేశ్ ముందుగానే 20 లక్షల మంది తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించింది. సహాయక చర్యల కోసం సైన్యాన్ని రంగంలోకి దింపింది.
బంగ్లాదేశ్లో 2007లో సంభవించిన సిద్ర్ తుపాను ధాటికి దాదాపు 3,500 మంది మరణించారు. మళ్లీ రెండు దశాబ్దాల తరువాత అంతటి నష్టాన్ని మిగిల్చింది అంపన్ తుపాను.
బలహీనపడే అవకాశం
"బుధవారం 160 కి.మీ నుంచి 180 కి.మీ వేగంతో బంగ్లాదేశ్ తీరాన్ని తాకిన అంపన్ తీరప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. అయితే ప్రస్తుతానికి ఉత్తర-ఈశాన్య దిశలో పయనిస్తున్న అంపన్ తుపాను క్రమంగా బలహీనపడే అవకాశముంది."
- బంగ్లాదేశ్ వాతావరణ శాఖ
ఇదీ చూడండి: కరోనా వేళ జీ-7 సదస్సుకు సిద్ధమన్న ట్రంప్