భారతదేశానికి వ్యతిరేకంగా దుందుడుకుగా ముందుకు వెళ్లిన చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్.. అనూహ్య వైఫల్యం చెందారని అమెరికాలో ప్రముఖ మ్యాగజీన్ 'న్యూస్ వీక్' పేర్కొంది. భారత భూభాగంలోకి సైన్యాన్ని పంపించడం వెనుక వ్యూహ రచన అంతా ఆయనదేనని తెలిపింది. అయినా ఆ యత్నాన్ని భారత సైన్యం గట్టిగా తిప్పి కొట్టడంతో జిన్‌పింగ్ భంగపాటుకు గురయ్యారని విశ్లేషించింది. భారత సైన్యం దక్షతను కొనియాడింది. చైనా అధ్యక్షుడు తన భవితవ్యాన్ని ప్రమాదంలో నెట్టేసుకున్నారని విమర్శించింది.
"ఇప్పటికే జిన్‌పింగ్ చైనాలో తన ప్రత్యర్థులపై అణచివేత విధానాలకు పాల్పడుతున్నారు. దానిపై స్వదేశంలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆయన తాజా వైఫల్యంతో భారత సైనిక దళాలపై ఇంకో రకంగా దూకుడు చర్యకు పాల్పడవచ్చు. చైనా వైఫల్యానికి పరిణామాలు ఇంకా ఉంటాయి." అని హెచ్చరించింది.
భారత్‌లో మరేదైనా ప్రదేశాలను చైనా సైన్యం తమ తదుపరి లక్ష్యంగా చేసుకోవచ్చని తెలిపినా, అది ఎంతవరకు డ్రాగను కలిసి వస్తుందనే స్పష్టతను కథనంలో ఇవ్వలేదు. గతంలో వియత్నాంకు పాఠం చెబుతామని వెళ్లినప్పుడూ చైనా సైన్యం గట్టి ఎదురుదెబ్బ తినాల్సి వచ్చిందని గుర్తు చేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీకి, పార్టీలో కేంద్ర మిలిటరీ కమిషన్‌కు , పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి నేతగా జిన్‌పింగ్ ఉండడం వల్ల భారత్‌పై మరోసారి దుందుడుకు చర్యకు దిగే అవకాశమే ఉందని అంచనా వేసింది.
భారత సైనికులు ఎత్తైన పర్వతాల పైకి ముందుగానే చేరుకున్న తీరుతో చైనా సైన్యం విస్మయానికి గురైందని తెలిపింది. జిన్‌పింగ్ భంగపడ్డారంటే అది అందరికీ సమస్య అవుతుందని పేర్కొంది.