కరోనా వైరస్ ధాటికి ప్రపంచం విలవిలలాడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య కూడా రోజురోజుకు భారీ స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం 14,25,032 కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి 81,932 మంది మరణించారు. వైరస్‌ను జయించి వారి సంఖ్య 3లక్షలు దాటింది. మొత్తం 3,01,771 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
ఫ్రాన్స్ పరిస్థితి...
ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా వైరస్ ధాటికి మృతుల సంఖ్య 10వేలు దాటింది. 10వేల మరణాలు దాటిన నాలుగో దేశం ఫ్రాన్స్.
మార్చి 1 నుంచి మొత్తం 10వేల 328మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 7,091మంది ఆసుపత్రుల్లో మృతిచెందారు. మరో 3వేల 237మంది వృద్ధాశ్రమాల్లో మరణించారు. ప్రాణాంతక మహమ్మారితో దేశం మరింత ఆరోగ్య సంక్షోభం తలెత్తే అవకాశముందని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
9/11 కన్నా..
9/11 ఉగ్రదాడిని అమెరికా ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. న్యూయార్క్ ట్విన్ టవర్స్‌లో జరిగిన ఈ ఘటనలో 2,977మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 2,753మంది న్యూయార్క్‌వాసులు ఉండటం గమనార్హం.
అయితే అమెరికాలో కరోనా కేంద్రబిందువైన న్యూయార్క్‌లో మరణాల సంఖ్య ఇప్పటికే 3వేలు దాటేసింది. ఇప్పటివరకు మొత్తం 3,202మంది ప్రాణాంతక వైరస్ సోకి మృతిచెందారు.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 లక్షల 95వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12,784 మంది మరణించారు. దాదాపు 22 వేల మంది కోలుకున్నారు.
2లక్షల కేసులు...
రానున్న వారాల్లో సౌదీ అరేబియాలో దాదాపు 2లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో 24గంటల కర్ఫ్యూ విధించిన ఒక రోజు తర్వాతే ఈ నివేదిక బయటకు రావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
'వైద్య పరికరాలిస్తాం..'
వైరస్‌పై పోరులో వైద్య పరికరాలు సమకూరుస్తామని పాకిస్థాన్ వైద్యులకు ఆ దేశ సైన్యం హామీనిచ్చింది. వైద్య పరికరాల కొరత ఉందంటూ నైరుతి బలుచిస్థాన్ రాష్ట్రంలో నిరసన చేపట్టిన 47మంది డాక్టర్లను అరెస్టు చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేసింది.