అటవీ.. జంతువులకు ఆవాసంగానే కాదు.. మానవ మనుగడను కాపాడటంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తోంది. అడవులు ఉండటం వల్లే ప్రకృతి, పర్యావరణం దెబ్బతినకుండా ఉంటోంది. అందుకే ఈ మధ్యకాలంలో అటవీభూముల్ని పెంచడం కోసం ప్రపంచదేశాలు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏటా మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా ప్రపంచంలో విస్తీర్ణం పరంగా టాప్ 10 అతిపెద్ద అడవుల గురించి తెలుసుకుందాం..!
1. అమెజాన్
దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో ఉన్న ఈ అమెజాన్ అటవీ.. 23లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో పొరుగు దేశాల్లోనూ విస్తరించి ఉంది. 5.6కోట్ల సంవత్సరాల కిందటి నుంచి ఈ అటవీ ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ అటవీ నుంచే ప్రపంచవ్యాప్తంగా 20శాతం ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందట. ఇక్కడ 3వేల రకాల పండ్లు లభిస్తాయి. జాగ్వార్, టాపిర్స్(పంది ఆకారంలో ఉండే పొడువు ముక్కు ఉన్న జంతువు) ఈ అటవీలో ఎక్కువగా కనిపిస్తాయి. పర్యాటకంగానూ చక్కటి ప్రదేశం.
2. కాంగో
ఆఫ్రికాఖండంలోని ఈ కాంగో అటవీప్రాంతం 7,81,249 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంటుంది. 600రకాల జాతులకు చెందిన చెట్లు, 10వేల జాతులకు చెందిన జంతువులు ఇక్కడ నివసిస్తున్నాయి. చిరుతపులులు, జిరాఫీ జాతికి చెందిన జంతువులు, నీటి ఏనుగులు ఈ అటవీలో ఎక్కువగా ఉంటాయి.
3. వాల్డివియన్ టెంపరేట్
దక్షిణ అమెరికాలోని చిలీలో ఉన్న ఈ అటవీ విస్తీర్ణం 95,800 చదరపు మైళ్లు. ప్రాచీనకాలం నాటి వృక్షాలు, వైల్డ్ బోర్స్ వంటి జంతువులు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి.
4. టోంగాస్
అలస్కాలోని టోంగాస్ అటవీ అమెరికాలో అతిపెద్ద జాతీయ అటవీప్రాంతం. 26,278 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్నీ అటవీ అమెరికా వ్యాప్తంగా దాదాపు 12శాతం కాలుష్యాన్ని తీసుకుంటుందట.ఇక్కడ డాల్ఫిన్ జాతికి చెందిన సముద్ర జీవులు, తోడేళ్లు, పందికొక్కులు ఎక్కువగా నివసిస్తుంటాయి.
5. సుందర్బన్స్
భారతదేశానికి తూర్పు దిశగా 3,900 చదరపు మైళ్ల విస్తీర్ణమున్న ఈ అటవీ కొంత భాగం భారత్.. మరికొంత భాగం బంగ్లాదేశ్‌లో ఉంది. 1984లో దీన్ని జాతీయ పార్కుగా గుర్తించారు. ఈ అటవీలో అంతరించిపోతున్న జాతులకు చెందిన జంతువులున్నాయి. మొత్తంగా 50 రకాల క్షీరద జాతులు, 60 రకాల పాము జాతులు, 300కుపై పక్షి జాతులకు ఈ అటవీ ఆవాసంగా ఉంటోంది. ఈ అటవీప్రాంతం ద్వారానే బ్రహ్మపుత్ర, పద్మ, మేఘన నదులు ప్రవహిస్తుంటాయి. ఈ అరణ్యాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. పెద్ద పులులు, అరుదైన బల్లులు ఇక్కడ ఉన్నాయి.
6. షిషుయాంగ్‌బన్నా
చైనాలోని యూన్నాన్ ప్రావిన్స్‌లో 927 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న షిషూయాంగ్‌బన్నా అటవీప్రాంతంలో 3,500రకాల వృక్ష, జంతుజాలాలు ఉన్నాయి. పులులు, ఆసియా ఏనుగులు, గిబ్బొన్స్ వంటి అంతరించిపోతున్న జంతువులు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
7. డైంట్రీ
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు ఉత్తరంవైపు ఉన్న డైంట్రీ అరణ్యాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన అటవీప్రాంతంగా చెబుతుంటారు. 463 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీని యునెస్కో వారసత్వ ప్రపంచసంపదగా గుర్తించింది. ఇక్కడ 3వేల జాతులకు చెందిన వృక్షాలు, 395 అంతరించిపోతున్న వృక్షజాతులు, 12వేల కీటక జాతులు ఉన్నాయట. విషపూరిత పాములు, కీటకాలు, బల్లులు, రంగురంగుల పక్షులు, జంతువులకు నెలవుగా ఈ డైంట్రీ అటవీప్రాంతం పేరుగాంచింది.
8. కినబాలు
కినబాలు అటవీని మలేషియా జాతీయ పార్క్‌గా ప్రకటించింది. బోర్నియో ప్రాంతంలో పర్వతాల మధ్యలో ఉన్న ఈ అటవీప్రాంతం 291 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా పేర్కొంది. ఇందులో 5వేల రకాల జాతుల మొక్కలు, అరుదైన బోర్నియన్ గిబ్బొన్స్, టార్సియర్స్, ఒరంగ్‌టాన్స్ వంటి జంతువులు ఉన్నాయి. ఎక్కువగా మౌస్ డీర్, ఉడతలు, ట్రీ ష్రూస్, కోతులు, పిగ్మి ఏనుగులు, మొసళ్లు కనిపిస్తాయి. ఈ అటవీలోనే కినబాలు పర్వతముంది. దీన్ని ఎక్కడానికి పర్యటకులు, పర్వాతరోహకులు ఆసక్తి చూపుతుంటారు.
9. మిండో నంబిల్లో క్లౌడ్
ఈక్వెడార్‌లోని మిండో ప్రాంతంలో ఉన్న ఈ మిండో నంబిల్లో ఈ అరణ్యం విస్తరించివుంది.. 74 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 1,600రకాల పక్షి, కప్ప, ఇతర కీటక జాతులున్నాయి. ఎంతో అందంగా ఉండే ఈ అటవీప్రాంతాన్ని పర్యటకులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. యుంబో-గిగువా తెగ ప్రజలు ఈ అటవీలోనే నివసిస్తుంటారట.
10. సింహరాజ
శ్రీలంకలో ఉందీ సింహరాజ అరణ్యం. దీని విస్తీర్ణం 34 చదరపు మైళ్లు. యునెస్కో దీన్ని 1998లోనే ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. జనవరి నుంచి మే మధ్య, ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య ఈ అటవీ చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుందట. అలాగే ఈ అటవీలో లోయలు, నదులుకూడా ఉన్నాయి. ఇక్కడి కాన్పాయ్ చెట్లు 45 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయట.
ఇదీ చూడండి: అడవుల్లో అగ్గి రాజుకుంటోంది!