2020లో కరోనా మహమ్మారి ధాటికి విలవిలలాడిన ప్రపంచంపై వైరస్ మరోమారు పంజా విసురుతోంది. హమ్మయ్య! అనుకుంటున్న సమయంలో కేసుల(covid cases) సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. గతవారం 30లక్షల కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. తొమ్మిది వారాలుగా తగ్గుముఖం పట్టిన మరణాలు(corona deaths) కూడా.. గత వారం పెరిగాయి. 55వేల మంది కరోనాకు బలయ్యారు, ఇది అంతకు ముందు వారంతో పోల్చుకుంటే 3శాతం ఎక్కువ.
ఈ నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షల వలయంలోకి జారుకుంటున్నాయి. 2020 నాటి చీకటి రోజులు మళ్లీ ప్రజల కళ్లముందు కదులుతున్నాయి.
ఆసియా పెసిఫిక్..
- రష్యాలో ఈ వారం రికార్డు స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి.
- టోక్యోలో లాక్డౌన్ కొనసాగుతోంది. ఒలింపిక్స్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు కేసులు పెరుగుతుండటం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది.
- దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో కఠిన ఆంక్షలు విధించారు. భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండటమే ఇందుకు కారణం.
- మయన్మార్‌లో కరోనా మృతుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. శ్మశానవాటికల్లో సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది.
- ఇండోనేసియాలో బుధవారం 54వేల కొత్త కేసులు, 1000 మరణాలు నమోదయ్యాయి. నెలరోజుల క్రితం కేసుల సంఖ్య రోజుకు 8000గా ఉండటం గమనార్హం.
- ఆస్ట్రేలియాలోని సిడ్నీలో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేశారు. ఈ నెల చివరి వరకు లాక్డౌన్ కొనసాగనుంది.
బ్రిటన్- ఐరోపా
- బార్సిలోనాతో పాటు స్పెయిన్‌లోని పలు ప్రదేశాల్లో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది.
- విదేశాలకు వెళ్లివచ్చే వాళ్లు క్వారంటైన్లో ఉండాలని ఇటలీ స్పష్టం చేసింది.
- బ్రిటన్‌లో కొత్తగా 40వేల కేసులు(Britain corona cases) బయటపడ్డాయి. గత ఆరు నెలల్లో ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి. అయితే ఇంగ్లాండ్‌లో ఆంక్షల సడలింపునకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆంక్షలు ఉన్నా, లేకపోయినా.. బస్సులు, రైళ్లల్లో మాస్కులు కచ్చింగా వాడాలని స్పష్టం చేశారు.
అమెరికా..
- టీకా పంపిణీలో అగ్రస్థానంలో ఉన్న.. అమెరికాలోనూ రెండువారాలుగా సగటున 24వేల కేసులు(US corona cases) నమోదవుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఇది రెండింతలు. అయితే మరణాల సంఖ్యలో పెద్దగా మార్పులు లేకపోవడం కొంత ఉరటనిచ్చే విషయం.
- అగ్రరాజ్యంలోనే అత్యధిక జనాభా కలిగిన లాస్ ఏంజెల్స్‌లో మంగళవారం వెయ్యికిపైగా మందికి కరోనా సోకింది.
- పలు ప్రాంతాల నుంచి వస్తున్న పర్యటకులు 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని లేదా కరోనా నెగిటివ్ రిపోర్టు చూపించాలని షికాగో అధికారులు ప్రకటన జారీ చేశారు.
కారణాలు..
ఉద్ధృతి మళ్లీ పెరగడానికి.. టీకా పంపిణీ ప్రక్రియ నెమ్మదించడం, మాస్కులతో పాటు ఇతర నిబంధనలను పలు దేశాలు సడలిస్తుండటం, డెల్టా వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉండటాన్ని నిపుణులు కారణాలుగా చెబుతున్నారు.
ఇదీ చూడండి:- పిల్లల్లోనూ పోస్ట్ కొవిడ్ లక్షణాలు!