అద్భుత పదార్థం గ్రాఫీన్‌ను ఉపయోగించి కరోనా వైరస్‌ను గుర్తించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఒక విధానాన్ని కనుగొన్నారు. దీని ద్వారా కరోనాయే కాకుండా, దానికి సంబంధించిన వేరియంట్లను అత్యంత కచ్చితత్వంతో, వేగంగా, చౌకలో గుర్తించేందుకు వీలవుతుందని వారు తెలిపారు. షికాగోలోని ఇలినోయి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన చేసింది. గ్రాఫీన్‌కు విశిష్ట లక్షణాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక పరమాణువంత మందాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల గ్రాఫీన్ ఫలకం సాధారణ పోస్టల్ స్టాంపు కన్నా వెయ్యి రెట్లు పలుచగా ఉంటుంది. ఈ పదార్థంలో కర్బన పరమాణువులు ఉంటాయి. వీటి కదలికలు, స్థితిస్థాపకత వల్ల ప్రకంపనలు వెలువడతాయి. ఈ లక్షణాన్ని శాస్త్రవేత్తలు తాజాగా ఉపయోగించుకున్నారు.
ఎలా చేశారంటే..
శాస్త్రవేత్తలు కొన్ని గ్రాఫీన్ ఫలకాలను కలగలిపారు. వీటికి.. కరోనాలోని స్పైక్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఉద్దేశించిన యాంటీబాడీలను జోడించారు. ఆ తర్వాత కొవిడ్‌తో కూడిన, ఆ వైరస్ జాడలేని కృత్రిమ లాలాజల నమూనాలను ఈ ఫలకాలపై ఉంచారు. అనంతరం ఈ ఫలకాల్లో పరమాణు స్థాయి ప్రకంపనలను రామన్ స్పెక్ట్రోమీటర్‌తో లెక్కించారు. కొవిడ్ పాజిటివ్ నమూనాను తాకినప్పుడు సదరు గ్రాఫీన్ ఫలకం ప్రకంపనల్లో మార్పులు వచ్చాయి. ఆ నమూనాలోని వైరస్.. గ్రాఫీన్‌తో చర్య జరపడమే ఇందుకు కారణం. "గ్రాఫీన్ ఒక పరమాణు మందాన్ని మాత్రమే కలిగి ఉండటంవల్ల దాని ఉపరితలంపైకి కొత్తగా ఒక అణువు వచ్చి చేరినా అది చాలా ఎక్కువే. ఫలితంగా ఆ పదార్థ ఎలక్ట్రానిక్ శక్తిలో మార్పులు వస్తాయి. ప్రకంపనల్లో మార్పుల రూపంలో వాటిని పసిగట్టొచ్చు. ఐదు నిమిషాల్లోపే అవి బయటపడతాయి" అని పరిశోధనకు నాయకత్వం వహించిన వికాస్ బెర్రీ చెప్పారు. కొవిడ్ నెగిటివ్ నమూనాలను ప్రయోగించినప్పుడు మాత్రం ఇలాంటి వైరుధ్యాలు కనిపించలేదన్నారు.
ఇదీ చూడండి: రెండు వేర్వేరు టీకా డోసులు కలపొచ్చా?
ఇదీ చూడండి: తీవ్రస్థాయి కొవిడ్ రోగుల పాలిట సంజీవని!