అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ల్యాప్‌టాప్‌ను దొంగిలించి రష్యాకు అమ్మాలనుకున్న రిలే జూన్ విలియమ్స్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 6న యూఎస్ క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిలో పెలోసీ ల్యాప్‌టాప్‌ను మహిళ దొంగిలించిందని ఎఫ్‌బీఐ తెలిపింది. పెన్సిల్వేనియాలో మహిళను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.
దొంగిలించిన ల్యాప్‌టాప్‌ను విలియమ్స్.. తన స్నేహితురాలి ద్వారా రష్యా ఇంటెలిజన్స్ సర్వీస్(ఎస్వీఆర్)కు విక్రయించాలని ప్రణాళిక వేసుకుందని ఎఫ్‌బీఐ పేర్కొంది. ల్యాప్‌టాప్‌ను మహిళ దొంగిలిస్తున్న వీడియోను ఓ వ్యక్తి తమకు చూపించాడని వెల్లడించింది.
పెలోసీ ప్రెసెంటేషన్ ల్యాప్‌టాప్ చోరీకి గురైన విషయాన్ని క్యాపిటల్ దాడి తర్వాత అధికారులు ధ్రువీకరించారు. అయితే, విలియమ్స్ దొంగిలించిన ల్యాప్‌టాప్ అదేనా అన్నది తేలాల్సి ఉంది. ఆ ల్యాప్‌టాప్ విలియమ్స్ అధీనంలో ఉందా లేదంటే ధ్వంసం చేసిందా అనే విషయంపై స్పష్టత లేదు.
ఇదీ చదవండి: చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?