అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఓట్ల లెక్కింపులో పారదర్శకత, నిజాయతీ ఉండాలన్న అమెరికన్ల హక్కుకోసం తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. మొదటి నుంచి స్వింగ్ స్టేట్‌లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు ట్రంప్. తమ నుంచి డెమోక్రాట్లు అక్రమంగా విజయాన్ని లాక్కున్నారని ఆరోపణలు చేశారు.
చట్టబద్ధమైన ఓట్లు తదుపరి అధ్యక్షుడు ఎవరన్నది తేల్చుతాయి కానీ మీడియా కాదంటూ వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి తమ న్యాయపోరాటం మొదలవుతుందని ట్రంప్ అన్నారు. కోర్టుల ద్వారా ఎన్నికల చట్టాలు సక్రమంగా అమలయ్యేలా.. చట్టబద్ధమైన విజేతలే అధ్యక్ష పీఠం అధిష్ఠించేలా చూస్తామన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో పెద్ద మీడియా సంస్థలు, పెద్ద టెక్ సంస్థలు తనకు వ్యతిరేకంగా పనిచేశాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఒక్క పార్టీ మాత్రమే అక్రమాలకు పాల్పడిందని పరోక్షంగా డెమొక్రాట్లపై విరుచుకుపడ్డారు. బైడెన్ దేశ ప్రజల నుంచి ఎం దాస్తున్నారో దానిని బయటపెట్టే వరకు తన పోరాటం ఆగదన్నారు ట్రంప్.
- ఇదీ చూడండి: రెండోసారి శ్వేతసౌధానికి చేరని అధ్యక్షులు వీరే