కరోనాతో అమెరికా అతలాతకుతలమవుతున్న తరుణంలో.. మరో ప్రమాదం అగ్రరాజ్య ప్రజలను భయాందోళలకు గురి చేస్తోంది. ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్‌లో కార్చిచ్చు చెలరేగింది. అప్రమత్తమైన అధికారులు.. దాదాపు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
శాంటా రోసా కౌంటీలో సోమవారం మధ్యాహ్నం మంటలు చెలరేగినట్టు తెలిపిన ఫ్లోరిడా ఫారెస్ట్ సర్వీస్ ... వీటికి 'పైవ్ మైల్ స్వాప్ ఫైర్' అని పేరు పెట్టినట్లు వెల్లడించింది. కార్చిచ్చు చెలరేగిన అనంతరం.. విపరీతమైన గాలులు, తక్కువ తేమ కారణంగా మంటలు 10 రెట్లు విస్తరించినట్లు పేర్కొన్నారు.
కార్చిచ్చుతో ఇప్పటి వరకు 2 వేల ఎకరాల వరకు మంటలు వ్యాపించటం వల్ల పెద్ద సంఖ్యలో ఇళ్లు కాలి బూడిదయ్యాయని అధికారులు తెలిపారు. అందువల్ల దక్షిణ ప్రాంతంలో ఉన్న కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. ఆ ప్రాంతంలో ప్రజలను తరలించే పక్రియ కొనసాగుతూనే ఉందన్నారు అధికారులు. మంటలను అదుపు చేయటానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తోందని వెల్లడించారు.