ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచదేశాలకు అమెరికాయే వ్యాక్సిన్ అందించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. పలు దేశాలు వ్యాక్సిన్ తయారీలో పురోగతి కనబరుస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
'వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దాన్ని అంతటా సరఫరా చేస్తాం. ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా శరవేగంగా జరుగుతుంది. వెంటిలేటర్లు, ఇతర వైద్య సామగ్రిని అందించిన తరహాలోనే వ్యాక్సిన్‌ను కూడా ప్రపంచదేశాలకూ అమెరికానే సరఫరా చేస్తుంది' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మోడెర్నా అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాపై ట్రంప్ బృందం అత్యంత విశ్వాసంగా ఉంది. 2021 ఆరంభానికి వ్యాక్సిన్ ప్రజా వినియోగానికి అందుబాటులోకి రావొచ్చని బలంగా విశ్వసిస్తోంది. మోడెర్నా టీకా తయారీలో కీలక ప్రక్రియ అయిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. 30 వేల మంది వలంటీర్లపై దీన్ని ప్రయోగించనున్నారు.
ఇదీ చూడండి: నేనంటే ఎవరికీ ఇష్టం లేదు: ట్రంప్