మరికొన్ని గంటల్లో శ్వేతసౌధాన్ని వీడనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన వీడ్కోలు సందేశాన్ని విడుదల చేశారు. తన చివరి ప్రసంగంలోనూ ఎక్కడా ఆయన బైడెన్ గెలుపును నేరుగా అంగీకరించలేదు. కేవలం కొత్తగా వచ్చే పాలకవర్గానికి శుభాకాంక్షలు అంటూ సందేశాన్ని ముక్తసరిగా కానిచ్చేశారు.
కొత్త పాలకవర్గం విజయం సాధించాలి..
"అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అద్భుతమైన అవకాశాన్నిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. ఈవారం కొత్త పాలకవర్గం విధుల్లోకి రానుంది. అమెరికాను సురక్షితంగా, సుభిక్షంగా తీర్చిదిద్దడంలో వారు విజయం సాధించాలని కోరుకుంటున్నా. వారికి మా శుభాకాంక్షలు. ఈ ప్రయాణంలో అదృష్టమూ వారికి తోడుండాలని ప్రార్థిస్తున్నా" అని ట్రంప్ శ్వేతసౌధంలోకి రానున్న బైడెన్ బృందానికి ఆహ్వానం పలికారు.
పార్టీలకతీతంగా ఏకతాటిపైకి రావాలి..
క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిపై ట్రంప్ మరోసారి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్ని సహించేదిలేదని వ్యాఖ్యానించారు. "క్యాపిటల్ భవనంపై జరిగిన దాడితో అమెరికావాసులంతా భయాందోళనకు గురయ్యారు. రాజకీయ హింస అనేది అమెరికా విలువలపై దాడి చేయడంతో సమానం. ఇలాంటి ఘటనల్ని ఎప్పటికీ సహించలేం. పార్టీలకతీతంగా మనమంతా ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలాంటి పక్షపాతం లేకుండా ఉమ్మడి లక్ష్యం కోసం కృషి చేయాలి" అంటూ ట్రంప్ చివరి క్షణంలో సాంత్వన వచనాలు వల్లెవేశారు.
అవన్నీ నా విజయాలే...
చైనా సహా పలు దేశాలతో నెరపిన విదేశాంగ విధానం తన హయాంలో సాధించిన విజయాలుగా ట్రంప్ చెప్పుకున్నారు. అలాగే వివిధ దేశాలతో కుదిరిన ఒప్పందాలను గుర్తుచేసుకున్నారు. ‘‘ అమెరికా నాయత్వాన్ని ఇటు దేశంతో పాటు అంతర్జాతీయంగా బలపర్చాం. యావత్తు ప్రపంచం మళ్లీ మనల్ని గౌరవించడం ప్రారంభించింది. ఆ హోదాను మనం ఎప్పటికీ కోల్పోవద్దు. వివిధ దేశాలతో ఉన్న సంబంధాలను పునరుద్ధరించడంతో పాటు చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో సఫలీకృతం అయ్యాం. మధ్యప్రాచ్యంలో అనేక శాంతి ఒప్పందాలు కుదిర్చేందుకు కృషి చేశాం. ఇవన్నీ జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. గత కొన్ని దశాబ్దాల చరిత్రలో ఎలాంటి యుద్ధాలు ప్రారంభించని తొలి అధ్యక్షుడిగా గర్వపడుతున్నాను’’ అని ట్రంప్ తెలిపారు.
అమెరికాకు అదే పెద్ద ముప్పు..
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఉన్న అమెరికాకు బయటి శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని ట్రంప్ తెలిపారు. నిరంతరం అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. అయితే, రానురాను అమెరికా ప్రజలు దేశ గొప్పతనంపై విశ్వాసం కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇదే దేశానికి అన్నింటికంటే పెద్ద ముప్పని పేర్కొన్నారు. అమెరికా సంస్కృతిని కాపాడుతూ.. దాని ఉనికిని రక్షిస్తేనే దేశ గొప్పతనం ఇనుమడిస్తుందని వ్యాఖ్యానించారు.
అలా చేయడం అమెరికా విలువలకే విరుద్ధం..
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో తనపై వేటు వేయడాన్ని ట్రంప్ పరోక్షంగా ప్రస్తావించారు. వాదోపవాదాలు, చర్చలు, విభేదించడం అమెరికా సంస్కృతిలో భాగమన్నారు. అసమ్మతివాదుల గొంతు అణచివేయాలనుకోవడం అమెరికా విలువలకే విరుద్ధమన్నారు. జవనరి 6న క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి తర్వాత ట్విటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ట్రంప్ ఖాతాలను నిషేధించింది. "నేను ఈ అద్భుతమైన ప్రదేశం నుంచి నమ్మకమైన, సంతోషకరమైన హృదయంతో.. ఆశావాద దృక్పథంతో.. మన దేశానికి, మన పిల్లలకు మరిన్ని ఉత్తమమైన రోజులు రాబోతున్నాయన్న అత్యున్నత విశ్వాసంతో వెళ్తున్నాను." అంటూ ట్రంప్ తన ప్రసంగాన్నిముగించారు.
భారత కాలమానం ప్రకారం.. ఈరోజు రాత్రి 10:30 గంటలకు బైడెన్ అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకంటే ముందే ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడి ఫ్లోరిడాలోని తన సొంత నివాసానికి వెళ్లనున్నారు. సంప్రదాయానికి భిన్నంగా కొత్త అధ్యక్షుని ప్రమాణస్వీకారానికి హాజరుకాకుండానే ఆయన వెళ్లిపోనున్నారు.
ఇదీ చూడండి:జాతి ఐక్యతా ప్రసంగానికి ముందు బైడెన్ భావోద్వేగం