హెచ్1బీ సహా ఉద్యోగ ఆధారిత వీసా విధానాల్లో మోసాలు, దుర్వినియోగాన్ని నివారించేలా ట్రంప్ ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుందని చట్టసభ సభ్యుల ముందు అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల(యూఎస్సీఐఎస్) అధికారి వెల్లడించారు. కాంగ్రెస్(అమెరికా చట్టసభ)లోని హౌజ్ జుడీషియరీ సబ్‌కమిటీ విచారణ సందర్భంగా యూఎస్సీఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పాలసీ జోసెఫ్ ఎడ్లో ఈ మేరకు వివరణ ఇచ్చారు.
అమెరికాలోని కార్మికులు, వ్యాపారాల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే నియమాలు, విధానాలు, కార్యాచరణ మార్పులను.. యూఎస్సీఐఎస్ అమలు చేసిందని చెప్పారు ఎడ్లో. హెచ్1బీ పిటిషనర్లు చెల్లించే ఫీజును అమెరికాలోని కార్మికుల శిక్షణకు ఉపయోగించేలా చూడటం, ఎల్1 పిటిషన్ల కోసం మార్గదర్శకాలను స్పష్టంగా విశదీకరించడం వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
న్యాయ శాఖ సమన్వయంతో..
అమెరికా విద్యా సంస్థల నుంచి మాస్టర్స్ లేదా అంతకన్నా ఎక్కువ హోదా డిగ్రీ సంపాదించిన వారికి హెచ్1బీ ఎంపిక ప్రక్రియలో వీసా అవకాశాలు పెంచడానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు జోసెఫ్ ఎడ్లో. ఉద్యోగాల విషయంలో యజమానుల మోసాలను గుర్తించి అరికట్టే విధంగా న్యాయ శాఖతో సమన్వయాన్ని పెంపొందించుకున్నట్లు చెప్పారు.
డేటా హబ్..
హెచ్1బీ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకునే ఎంప్లాయ్స్ సమాచారం అందించడానికి డేటా హబ్‌ను రూపొందించినట్లు తెలిపారు. హెచ్1బీ, హెచ్2బీ వీసా జారీలో జరిగే మోసాలను నివేదించడానికి ఆన్లైన్ టిప్ ఫాంను ఏర్పాటు చేసినట్లు వివరించారు. హెచ్1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ల సంఖ్యను అంచనా వేస్తూ తొలి నివేదికను యూఎస్సీఐఎస్ విడుదల చేసిందని తెలిపారు.
ఇదీ చదవండి: ఇల్లే బోధనాలయం- అమ్మానాన్నలే ఉపాధ్యాయులు