అంతర్జాతీయ వ్యవస్థను ఇబ్బందికి గురిచేసిన చైనా దుశ్చర్యలకు ఆ దేశం బాధ్యత వహించాల్సిందేనని అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకన్ పేర్కొన్నారు. చైనా విదేశాంగ మంత్రి యాంగ్ జైచీతో ఫోన్ ద్వారా శనివారం జరిగిన చర్చల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు అమెరికా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. షింజాంగ్, టిబెట్, హాంకాంగ్లలో చేపట్టిన దుశ్చర్యలకు చైనా బాధ్యత వహించాలన్నారు. మయన్మార్లో సైనిక తిరుగుబాటును చైనా కచ్చితంగా ఖండించాలన్నారు. ఈ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
చైనాను కట్టడి చేసేందుకు..
చైనా దుశ్చర్యలను కట్టడి చేసేందుకు అమెరికా తన భాగస్వాములతో కలిసి కృషి చేస్తుందని బ్లింకన్ స్పష్టం చేసినట్లు ఆ ప్రకటన పేర్కొంది. హద్దు మీర వద్దంటూ కొద్ది రోజుల క్రితం చైనా విదేశాంగ మంత్రి యాంగ్జైచీ అమెరికాను హెచ్చరించారు. మానవ హక్కులు, హాంకాంగ్, తైవాన్, కరోనా, షింజాంగ్, టిబెట్ అంశాలు చైనా సార్వభౌమత్వానికి, ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయాలని తెలిపారు. ఇప్పుడు బదలుగా బ్లింకన్ ఇవే అంశాలపైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి : చైనా మొండి వైఖరిపై నేపాల్ వ్యాపారుల ఆందోళన