US UNIVERSITY CASTE: అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ (సీఎస్‌యూ).. తమ వివక్ష వ్యతిరేక విధానంలో అదనంగా కులాన్ని చేర్చడంపై వివాదం రేగుతోంది. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని 80కి పైగా అధ్యాపక సిబ్బంది సీఎస్‌యూ ట్రస్టీలకు లేఖ రాశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, భారతీయ, దక్షిణాసియా మూలాలు ఉన్న అల్పసంఖ్యాక హిందువులను లక్ష్యంగా చేసుకొని రూపొందించారని వారు పేర్కొన్నారు.
Anti caste move CSU
ఈ కొత్త నిబంధన ప్రకారం.. కులపరమైన అణచివేతకు గురైన విద్యార్థులు ఫిర్యాదు చేయొచ్చు. భారత సామాజిక కులవ్యవస్థలో దళితులు అట్టడుగున ఉంటారని, వేల ఏళ్ల నుంచి వీరు వివక్షను, హింసను ఎదుర్కొంటున్నారని దళిత పౌర హక్కుల సంఘం 'ఈక్విటీ ల్యాబ్స్' తెలిపింది. భారత్‌లో దళితులను అంటరాని వారుగా చూస్తారని, ఇది చట్టవిరుద్ధమైనా.. వివక్ష కొనసాగుతూనే ఉందని పేర్కొంది. నిబంధనను వ్యతిరేకిస్తున్న అధ్యాపకులు.. ఏ రకమైన వివక్ష నుంచైనా రక్షించటానికి ఇప్పటికే వివిధ విధానాలు ఉన్నాయని తెలిపారు. కులాన్ని చేర్చటం ద్వారా సీఎస్‌యూ.. కేవలం దక్షిణాసియా, భారత్‌లోని అల్పసంఖ్యాక వర్గాలను లక్ష్యంగా చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌కు మద్దతుగా ఈయూ- భారీగా నాటో దళాల మోహరింపు