US Travel Requirements: కొవిడ్-19 కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' విజృంభణ దృష్ట్యా అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా టెస్టింగ్ నిబంధనలను కఠినతరం చేయనుంది అమెరికా. అమెరికాకు వచ్చే ప్రయాణికులు.. జర్నీకి ఒక్కరోజు ముందుగానే వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయించుకునే విధంగా నిబంధనలు తీసుకురానున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) తెలిపింది.
ప్రస్తుతం ఈ గడువు మూడురోజులు ఉంది. వ్యాక్సినేషన్ తీసుకున్నవారికీ, తీసుకోనివారికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.
"ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్ టెస్టింగ్ విధానంలో మార్పులు చేసేందుకు సీడీసీ యత్నిస్తోంది. నూతన నిబంధనల వల్ల వైరస్ నిర్ధరణ పరీక్షల సమయం తగ్గనుంది. ఇది అన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వర్తిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాన్ని ఎలా సురక్షితం చేయాలన్నదానిపై, క్వారంటైన్ విధానంపైనా సీడీసీ సమీక్షిస్తోంది."
-- డాక్టర్ రోచెల్ వాలెన్స్కీ, సీడీసీ డైరెక్టర్
విదేశీ ప్రయాణికులు అమెరికాకు వచ్చాక వారికి స్థానికంగా కరోనా పరీక్షలు నిర్వహించడంపైనా దృష్టి సారిస్తున్నామని రోచెల్ తెలిపారు. ప్రస్తుత నిబంధన ప్రకారం అమెరికాకు వచ్చిన ప్రయాణికులు.. 3-5 రోజుల తర్వాత కొవిడ్ పరీక్ష చేయించుకోవాల్సి ఉందన్నారు.
వ్యాక్సినేషన్ పూర్తయిన ప్రయాణికులు అమెరికాకు వచ్చేందుకు నవంబరు 8 నుంచి అనుమతులు ఇచ్చింది బైడెన్ ప్రభుత్వం.
Fauci On Omicron: ప్రపంచంలోని 20 దేశాలకుపైగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందినా.. కొత్త వేరియంట్ గురించి ఇంకా చాలా తెలియాల్సి ఉందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్. ఆంటోనీ ఫౌచీ తెలిపారు. వచ్చే 2-4 వారాల్లో ఒమిక్రాన్ వేరియంట్ అధిక సమాచారం తెలుస్తుందన్నారు.
కొవిడ్ వ్యాప్తిపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అన్నింటినీ మూసివేయకుండా, లాక్డౌన్ ప్రకటించకుండా.. వ్యాక్సినేషన్, టెస్టింగ్, బూస్టర్స్ విధానంతో ఈ శీతాకాలంలో కొవిడ్-19ను కట్టడిచేయాలన్న దానిపై వ్యూహాత్మక విధానాన్ని త్వరలో తీసకొస్తామన్నారు.
ఇదీ చూడండి: కొవిడ్ మాత్ర వినియోగానికి అమెరికా ఎఫ్డీఏ సానుకూలం!