ఇప్పటికే కరోనా వైరస్‌ను ప్రపంచానికి అందించిన చైనా.. ఇప్పుడు మరో ముప్పును భూమి నెత్తిన పెట్టింది. ఇటీవలే చైనా ప్రయోగించిన ఓ రాకెట్ భూమిపై కూలే దిశగా ప్రయాణిస్తోంది. వాస్తవానికి రాకెట్ ప్రయోగాలు చేస్తే వాటి శకలాలు సముద్రంలో పడేట్లు జాగ్రత్త పడతారు. కానీ, చైనా రాకెట్ శకలాలు భూమిపై పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.
చైనా ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రయోగాలను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 29న ఆ దేశానికి చెందిన లాంగ్‌మార్చ్5బీ రాకెట్ తియాన్హే స్పేస్ స్టేషన్ కోర్ మాడ్యూల్‌ను అంతరిక్షంలోని 300 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి చేర్చింది. ఇప్పుడు ఆ లాంగ్ మార్చ్ రాకెట్ శకలాలు పొరబాటున ఓ తాత్కాలిక కక్ష్యలోకి చేరాయి. అవి భూమిపై పడనున్నాయి. కచ్చితంగా ఎక్కడ కూలతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పటికే 80 కిలోమీటర్లు కిందకు పడిపోయినట్లు స్పేస్ న్యూస్ సంస్థ రిపోర్ట్ చేసింది. ఇది నేలపై పడే అవకాశాలు 71శాతం ఉన్నట్లు సమాచారం.
గతంలో ఐవరీ కోస్ట్‌కు పీడకల..
లాంగ్‌మార్చ్ రాకెట్ జనావాసాలపై పడుతుందనే భయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు." ఇది ఏమాత్రం మంచి విషయం కాదు" అని హార్వర్డు విశ్వవిద్యాలయానికి చెందిన ఆస్ట్రోఫిజిస్ట్ జోనాథన్ మెక్‌డోవెల్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా లాంగ్‌మార్చ్ బీ శ్రేణి రాకెట్‌ను చైనా ప్రయోగించింది. అది ఐవరీ కోస్ట్‌లోని జనావాసాలపై కూలి బీభత్సం సృష్టించింది. చాలా భవనాలు దెబ్బతిన్నాయి. ఒక రకంగా ఆ రోజు లోహపు ముక్కల వర్షం కురిసింది. అదృష్టవశాత్తు ఆఘటనలో ఎవరూ గాయపడలేదు.
ముప్పు వీటికి..
ఇక తాజాగా ప్రయోగించిన లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్ శకలాలు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. వీటిల్లో న్యూయార్క్, మాడ్రిడ్, బీజింగ్, చిలీ, న్యూజిలాండ్ తదితర ప్రాంతాలు ఉన్నట్లు ‘ది గార్డియన్’ కథనంలో పేర్కొంది.
చైనా అంతరిక్ష ప్రయోగం అంటే వణుకే..
2019 నవంబర్‌లో చైనాలోని జిచాంగ్ ప్రయోగ వేదిక నుంచి ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు లాంగ్‌మార్చ్ 3బీ రాకెట్‌ను ప్రయోగించారు. కొద్ది నిమిషాల్లో సిచువాన్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామంపై దాని శకలాలు కూలాయి. అప్పట్లో స్థానికులు ఈ ఘటనను చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పెట్టారు. ఆ వీడియోలు, ఫొటోలను చైనా ప్రభుత్వం ఆ తర్వాత తొలగించింది. ఇది ఫాల్కన్9 రాకెట్ సైజులో ఉంటుంది.
ఈ జిచాంగ్ వేదికపై ఏటా పలు రాకెట్ ప్రయోగాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో చుట్టుపక్కల గ్రామాలను హెచ్చరించి ఖాళీ చేయించడం పరిపాటిగా మారింది. అమెరికా, ఇతర దేశాల రాకెట్ బూస్టర్లు సాధారణంగా సముద్రంలో కూలతాయి. కానీ, చైనా రాకెట్ బూస్టర్లు భూభాగాలపై పడుతుంటాయి.
ఇక 1996లో ఫిబ్రవరి 15వ తేదీన లాంగ్‌మార్చ్ 3బీ శ్రేణి రాకెట్‌ను ప్రయోగించింది. ఇది సమీపంలోని మైలిన్ అనే గ్రామంపై పడి పదుల సంఖ్యలో మరణించారని వార్తలొచ్చాయి. కానీ, చైనా న్యూస్ ఏజెన్సీ జినూవా ప్రకారం ఆరుగురు చనిపోగా 57 మంది గాయపడ్డారు. అమెరికా ఏజెన్సీలు మాత్రం కనీసం 200మంది చనిపోయినట్లు చెబుతున్నాయి.
చైనా మంటలు..
ఇటీవల తియాన్హే కోర్‌మాడ్యూల్ విజయాన్ని చెప్పుకోవడానికి సెంట్రల్ పొలిటికల్ అండ్ లీగల్ అఫైర్స్ కమిషన్ ఈ లాంగ్‌మార్చ్5బీ ప్రయోగం - భారత్‌లో చితిమంటల ఫొటోలను కలిపి పోస్టు చేసింది. 'చైనా వెలిగించిన మంటలు వర్సెస్ భారత్ వెలిగించిన మంటలు' అంటూ దిగజారిన వ్యాఖ్యలను జోడించింది. ఈ పోస్టుపై చైనాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చాలా మంది ఆన్‌లైన్ యూజర్లు దీనిపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మర్నాడే ఆ పోస్టు మాయమైంది. ఆ చైనా వెలిగించిన మంటలే ఇప్పుడు ప్రపంచ దేశాలకు ముప్పుగా మారాయి. అమెరికా ట్రాకింగ్..
అమెరికా ట్రాకింగ్..
చైనా ఇటీవల.. ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ లొకేషన్‌ను ట్రాక్ చేస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. రాకెట్ భూమిపై కూలే దిశగా ప్రమాదకరంగా ప్రయాణిస్తోందని తెలిపింది. మే 8న ఇది భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు అమెరికా శాస్త్రవేత్తలు.
"అంతరిక్షంలో చైనీస్ లాంగ్‌మార్చ్ 5బీ ఉన్న లొకేషన్ గురించి అమెరికా స్పేస్ కమాండ్‌కు పూర్తి అవగాహన ఉంది. దాన్ని ట్రాక్ చేస్తున్నాం. అయితే భూవాతావరణంలో అది ఎక్కడ కచ్చితంగా ప్రవేశిస్తుందో ఇప్పుడే నిర్ధారించలేం. కొన్ని గంటల ముందే చెప్పగలం. అది ఈ నెల 8న భూవాతావరణంలోకి ప్రవేశించనుందని అంచనా వేస్తున్నాం"
-- పెంటగాన్ స్పేస్ కమాండ్ సెంటర్
అప్పటి వరకూ ఆ రాకెట్ లొకేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామని వెల్లడించింది.
ఇదీ చదవండి : ఇంటిపై కూలిన విమానం- నలుగురు మృతి