నేడు అమెరికా- భారత్ మధ్య 2+2 సమావేశం జరగనుంది. ఇందుకు అగ్రరాజ్యంలోని కాలిఫోర్నియా వేదికకానుంది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రధాన్యత సంతరించుకుంది.
భారత్- అమెరికా మధ్య క్లిష్టమైన దౌత్య, భద్రత అంశాల్లో సహకారాన్ని పెంపొందించే మార్గాలను చర్చించడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
ఈ చర్చల ద్వారా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం అవుతుందని యూఎస్ విదేశాంగశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
అమెరికా ప్రతినిధి బృందానికి దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయమంత్రి అలిస్ వెల్స్, ఇండో-పసిఫిక్ రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి రాండాల్ ష్రివర్ సంయుక్తంగా నాయకత్వం వహించనున్నారు.
ద్వైపాక్షిక సహకారం
శుక్రవారం అమెరికా-భారత్ మధ్య 4వ సముద్ర భద్రత చర్చలు జరుగనున్నాయి. ఇందులో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర పరిణామాలపై ఇరుపక్షాలు చర్చిస్తాయి. అలాగే ద్వైపాక్షిక సముద్ర భద్రత సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటాయని అగ్రరాజ్యం అధికారిక ప్రకటన చేసింది.
ఇదీ చూడండి: ఫ్రాన్స్ పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ