హెచ్-1బీ వీసా ర్యాండమ్ సెలక్షన్ ప్రక్రియలో ఎంపికకాని అభ్యర్థులకు మరో అవకాశం అందించేందుకు సిద్ధమవుతోంది అమెరికా. హెచ్-1బీ వీసా రెండో విడత లాటరీ ప్రక్రియను త్వరలో చేపట్టనున్నట్లు తెలిపింది. కంప్యూటరైజ్డ్ వ్యవస్థ ద్వారా చేపట్టిన మొదటి విడత డ్రాలో కావాల్సినంత మందికి వీసాలు అందజేయనందున.. రెండోసారి ఈ లాటరీని నిర్వహించాలని భావిస్తున్నట్లు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవలు(యూఎస్సీఐఎస్) విభాగం తెలిపింది.
"2022 ఆర్థిక సంవత్సరం అవసరాలను తీర్చేందుకు మరిన్ని రిజిస్ట్రేషన్లు కావాలని ఇటీవలే మేము గుర్తించాం. ఇంతకుముందు వచ్చిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లను జులై 28న మేము ర్యాండమ్ సెలక్షన్ ప్రాసెస్‌లో ఎంపిక చేశాం. ఈ అభ్యర్థులకు తమ పిటిషన్ దాఖలు చేసే వ్యవధి ఆగస్టు 2న ప్రారంభమై.. నవంబర్3 వరకు కొనసాగుతుంది."
-యూఎస్సీఐఎస్
అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కలిగించేదే హెచ్-1బీ వీసా. ఏటా వేల సంఖ్యలో భారతీయులు, చైనీయులు ఈ వీసాల ద్వారా అమెరికాలో ఉపాధి పొందుతున్నారు. అమెరికా తాజా నిర్ణయంతో హెచ్-1బీ వీసా కోసం ఎదురు చూస్తున్న అనేక మందికి లబ్ధి చేకూరనుంది.
మరోవైపు.. 2021 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు పిటిషన్ దాఖలు చేసి ఎంపికైన అభ్యర్థులు మాత్రమే 2022 ఆర్థిక సంవత్సరంలో క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్ దాఖలు చేసేందుకు అర్హులవుతారని యూఎస్సీఐఎస్ తెలిపింది. హెచ్-1బీ పిటిషన్లను ఆన్లైన్లో సమర్పించేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: 'అగ్రరాజ్యం కంటే ఎక్కువగా ఆ దేశానికే మన విద్యార్థులు'
ఇదీ చూడండి: అమెరికా కాంగ్రెస్‌లో కొత్త బిల్లు- భారతీయ విద్యార్థులకు చిక్కులు!