ప్రపంచంలోనే అత్యంత క్రూర నిర్బంధ కేంద్రం గ్వాంటానమో బే జైలును అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. శిథిలావస్థకు చేరిన ఈ కారాగారంలోని ఖైదీలను మరో చోటకు తరలించినట్లు అమెరికా సదరన్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. క్యూబా సమీపంలోని అమెరికా నౌకా స్థావరంలో ఏర్పాటుచేసిన ఈ జైలులో వివిధ దేశాల నుంచి రహస్యంగా పట్టుకొచ్చిన వ్యక్తులను సీఐఏ, అమెరికా సైనిక దళాలు బంధించేవి. క్యూబాకు ఆగ్నేయంగా సముద్ర తీరంలో గ్వాంటానమా బే నౌకా స్థావరం ఉంది. ఇక్కడ ఇప్పటిదాకా బంధించిన క్యాంప్ 7లోని ఖైదీలను క్యాంప్ 5కు మార్చినట్లు మయామీ కేంద్రంగా పనిచేసే సదరన్ కమాండ్ వెల్లడించింది. అయితే, ఎంత మందిని తరలించారనే వివరాలు తెలపలేదు. క్యాంప్ 7లోకి పాత్రికేయులు సహా ఇతరులెవరికీ అనుమతి లభించేది కాదు. అసలు అది ఎక్కడ ఉండేదో కూడా వెల్లడించేందుకు అమెరికా సైన్యం నిరాకరించేది.
2001లో ఉగ్రదాడులకు పాల్పడినట్లు ఆరోపణలున్న అయిదుగురు వ్యక్తులను కూడా యుద్ధ నేరారోపణలతో క్యాంప్ 7లో బంధించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గ్వాంటానమో బే జైలును పూర్తిస్థాయిలో మూసివేయాలని భావిస్తున్నట్లు ఇటీవల తెలిపారు. ఇందుకు అమెరికా చట్టసభల ఆమోదం అవసరం.
వివాదాల చరిత్ర
- ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు గురైన గ్వాంటానమో బే నిర్బంధ కేంద్రం నిర్మాణం 2002 నుంచి వివిధ దశల్లో కొనసాగింది.
- అమెరికా సైనికులు, సీఐఏ...అఫ్గానిస్థాన్, ఇరాక్ తదితర దేశాల నుంచి పట్టుకొచ్చిన ఇస్లామిక్ తీవ్రవాదులు, తాలిబన్, అల్‌ఖైదా ఉగ్రవాదులను ఇక్కడ ఖైదు చేసేవారు.
- జెనీవా ఒప్పందానికి విఘాతం, విదేశీ ఖైదీలకు ఉండే చట్టబద్ధమైన హక్కుల నిరాకరణ, విచారణలో క్రూరాతి క్రూరమైన పద్ధతుల అమలు వంటి చర్యలతో ఈ జైలు తీవ్ర వివాదాస్పదమైంది. అమెరికా సైన్యం అనుసరిస్తున్న పద్ధతులను ఆ దేశ సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది.
- అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, రెడ్ క్రాస్ తదితర సంస్థలు గ్వాంటానమో బే జైలులో జరిగే అమానవీయమైన చర్యలను పలుమార్లు ఖండించాయి.
ఇదీ చదవండి : గార్డ్స్ కళ్లలో కారం చల్లి 16 మంది ఖైదీలు పరార్