ఇరాన్‌పై ఉన్న ఐక్యరాజ్య సమితి ఆంక్షలన్నింటినీ పునరుద్ధరించినట్లు అమెరికా ప్రకటించింది. ఈ చర్యని చట్టవిరుద్ధంగా పేర్కొన్న ప్రపంచ దేశాలు.. ట్రంప్ పాలకవర్గంపై పెదవి విరిచాయి. త్వరలో జరగబోయే ఐరాస వార్షిక సమావేశాల్లో ఇది చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.
అగ్రరాజ్యం ఆరోపణలు..
2015లో కుదిరిన ఇరాన్ అణుఒప్పందం ప్రకారం 'జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్'(జేసీపీఓఏ)లోని నిబంధనల్ని.. ఇరాన్ ఏమాత్రం పాటించడం లేదని అమెరికా ఆరోపించింది. ఐరాస భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) చట్టాల నియమాల ప్రకారం.. నోటీసు ఇచ్చిన 30 రోజుల గడువు తర్వాత ఆంక్షలు అమలులోకి వచ్చాయని ప్రకటించింది.
ఆంక్షలు, వాటిని ఉల్లంఘించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సోమవారం శ్వేతసౌధం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఐరాస సభ్యదేశాలన్నీ ఈ ఆంక్షల్ని తప్పనిసరిగా పాటించాలని అమెరికా విదేశాంగశాఖ సెక్రటరీ మైక్ పాంపియో అన్నారు. లేదంటే కఠిన చర్యలకు సిద్ధం కావాలని హెచ్చరించారు.
వ్యతిరేకత...
ఇరాన్‌పై ఆంక్షల విషయంలో అమెరికా తీరును యూఎన్‌ఎస్‌సీలోని ఇతర సభ్యదేశాలు వ్యతిరేకించాయి. అమెరికా ప్రకటనను విస్మరించాలని నిర్ణయించాయి. అణు ఒప్పందం నుంచి వైదొలిగిన రోజే ఆంక్షలు విధించేందుకు ప్రతిపాదించే హక్కు అమెరికా కోల్పోయిందని గుర్తుచేసింది. మండలిలో సభ్యదేశంగా.. ఒప్పందంలో ప్రాథమిక సభ్యురాలిగా అమెరికాకు ఆ అధికారం ఉంటుందని అగ్రరాజ్యం వాదించింది.
అమెరికా ఆంక్షల్ని చైనా, రష్యా మొదటి నుంచీ తప్పుబడుతూ వస్తున్నాయి. అయితే తాజాగా మిత్రపక్షాలైన ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూఎన్‌ఎస్‌సీ అధ్యక్షుడికి లేఖ రాశాయి. అణు ఒప్పందంతో లభించిన ఆంక్షల మినహాయింపును ఇరాన్ అందిపుచ్చుకుంటుందని స్పష్టం చేశాయి.