కరోనా సంక్షోభంతో అంతర్జాతీయ సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ కూడా వర్చువల్‌గానే జరగనుంది. అయితే న్యూయార్క్‌లో జరగనున్న ఈ సెషన్‌కు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భౌతికంగా హాజరై ప్రపంచ నేతలనుద్దేశించి ప్రసంగించే అవకాశముంది. ఈ విషయాన్ని అమెరికా రాయబారి కెల్లీ క్రాఫ్ట్ వెల్లడించారు. ఇదే జరిగితే ఈ ఏడాది సర్వసభ్య సమావేశంలో నేరుగా పాల్గొననున్న ఏకైక నేత ట్రంప్ కానున్నారు.
ఈ ఏడాది ఐరాస 75ఏళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. అయితే ఈ 75 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆన్లైన్ వేదికగా సాధారణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రపంచ నేతలందరూ ముందుగానే వీడియోలు రికార్డు చేసి ఐరాసకు సమర్పించనున్నారు.
ఐరాస అమెరికాలో ఉండటం వల్ల సెప్టెంబర్ 22న జరగనున్న 75వ సర్వసభ్య సమావేశానికి ట్రంప్ హాజరయ్యే అవకాశాలు ఎక్కువ. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న ట్రంప్‌నకు తొలి దఫా అధ్యక్ష పదవిలో ఇదే చివరి ప్రసంగం కానుంది.
ఇదీ చూడండి:- అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నట్టా? లేనట్టా?