ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ నుంచి ఎప్పుడెప్పుడు విముక్తి లభిస్తుందా అని అనేక దేశాలు ఎదురుచూస్తున్నాయి. టీకా కోసం ఆరాటపడుతున్నాయి. మానవులపై చేస్తున్న మొదటి, రెండో దశల ప్రయోగాలు విజయవంతం అయ్యాయో, లేదో అందరికన్నా ముందుగానే వాటిని దక్కించుకొనేందుకు సిద్ధమవుతున్నాయి.
రెండు రోజుల క్రితమే బ్రిటన్ తొమ్మిది కోట్ల డోసులకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా 60 కోట్ల డోసులకు ఒప్పందం చేసుకొని సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ వార్తా వెబ్‌సైట్లలో ఇందుకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఫైజర్, బియోఎన్‌టెక్ ఎస్‌ఈ సంయుక్తంగా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోసం డొనాల్డ్ ట్రంప్ పాలకవర్గం ఒప్పందం చేసుకుంది.
"అక్కడ మేమే విజేత అనుకుంటున్నాం. ఇతర కంపెనీలూ వ్యాక్సిన్ల కోసం బాగానే కృషి చేస్తున్నాయి. నిర్ణీతకాలం కన్నా ముందే వస్తున్నాయి" అని డొనాల్డ్ ట్రంప్ మీడియాకు తెలిపారు. యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం పొందితే డిసెంబర్‌లోపు సరఫరా చేసే 10 కోట్లకు 200 కోట్ల డాలర్లు అమెరికా చెల్లించనుంది. అవి సురక్షితం, సమర్థమైనవని తేలితే ఒప్పందం ప్రకారం మరో 50 కోట్ల డోసులు కొనుగోలు చేస్తుంది. ప్రస్తుతం ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా కరోనా ధాటికి అధికంగా నష్టపోయింది.
ఇదీ చదవండి: అమెరికాపై విశ్వరూపం.. ఒక్కరోజే 76 వేల కేసులు