నైపుణ్యం ఉన్నవారికే పెద్దపీట వేస్తూ.. అమెరికా వలస చట్టాల్లో నూతన విధివిధానాలను ప్రతిపాదించింది ట్రంప్ పరిపాలన విభాగం. నైపుణ్య ఆధారిత వలసలను ఐదింతలు పెంచుతూ.. 57 శాతంగా నిర్ణయించింది. కుటుంబపరంగా, మానవీయ కోణంలో వచ్చేవారి కోటా సగానికి తగ్గించేందుకు ప్రతిపాదించింది.
ప్రస్తుత వలస విధానం ప్రపంచ దేశాల నుంచి నైపుణ్యవంతులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు అధ్యక్షుడి సీనియర్ సలహాదారు జేరెడ్ కుష్నర్. వచ్చే 10 ఏళ్లలో 500 బిలియన్ డాలర్ల పన్ను రాబడి సాధిస్తుందని శ్వేతసౌధంలో జరిగిన కేబినెట్ సమావేశంలో వివరించారు కుష్నర్.
ట్రంప్ ఆదేశాలతో ఇమిగ్రేషన్ సంస్కరణల బిల్లును కేబినెట్ ముందుకు తీసుకొచ్చారు కుష్నర్. తుది రూపులు దిద్ది త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం నైపుణ్యం ఆధారంగా 12 శాతం మంది మాత్రమే ఎంపికవుతున్నారని గుర్తుచేశారు.
"ప్రస్తుతం నైపుణ్య ఆధారిత వీసా పరిమితి కెనడాలో 53, న్యూజిలాండ్‌లో 59, ఆస్ట్రేలియాలో 63, జపాన్‌లో 52 శాతంగా ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన మేరకు మేము 57 శాతంగా నిర్ణయించాం. అది ప్రపంచ దేశాలతో మనల్ని పోటీలో నిలబెడుతుంది. గత ఏడాది 1.1 బిలియన్ల మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. ఈ ఏడాది అదే సంఖ్యను కొనసాగించాలని అనుకుంటున్నాం. కానీ పౌరసత్వం ఇచ్చే విధానంలో మార్పులు కోరుకుంటున్నాం."
-జేరెడ్ కుష్నర్, అమెరికా అధ్యక్షుడి సీనియర్ సలహాదారు
ఇతర దేశాల్లోని వలస విధానాలను సమగ్రంగా పరిశీలించాకే ఈ విధానాన్ని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు కుష్నర్. ప్రపంచంలోనే గొప్ప వలస విధానం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ట్రంప్ పరిపాలన విభాగం సురక్షిత, చట్టబద్ధమైన ఇమిగ్రేషన్ విధానాన్ని కోరుకుంటుందన్నారు. ఇష్టానుసారంగా జరిగే చట్టవిరుద్ధమైన వలసలను సహించేది లేదని స్పష్టంచేశారు కుష్నర్.
నైపుణ్య ఆధారిత వీసా విధానాన్ని ఎక్కువగా సద్వినియోగం చేసుకునేది భారతీయులే. కుష్నర్ ప్రతిపాదించిన కొత్త పద్ధతి అమల్లోకి వస్తే... భారత్‌కు చెందిన మరింత మందికి సులువుగా వీసాలు లభించే అవకాశముంది.
ఇదీ చూడండి: 'వివాదాల పరిష్కారానికి కీలక సమయమిది'