అఫ్గాన్ నుంచి బలగాల ఉపసంహరణ (Trump on Afghanistan) క్రమంలో అమెరికా పెద్దఎత్తున అధునాతన ఆయుధ సామగ్రిని అక్కడే విడిచిపెట్టింది. అయితే, వాటిని పనికిరాకుండా చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. కానీ.. సైన్యం వాటిని ధ్వంసం చేయకుండానే తిరిగొచ్చిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా (Donald Trump news) విమర్శలకు దిగారు. ఆ ఆయుధ సంపదతో ప్రస్తుతం రష్యా, చైనా సహా ఇతర శక్తులకు ప్రయోజనం చేకూరుతోందని ఆరోపించారు. బ్లాక్ మార్కెట్‌లోనూ వాటి విక్రయాలు సాగుతున్నాయన్నారు. డెస్ మొయిన్స్‌లో నిర్వహించిన 'సేవ్ అమెరికా ర్యాలీ'లో భాగంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఇప్పటికే రష్యా, చైనా వద్ద అమెరికాకు చెందిన అధునాతన హెలికాప్టర్ల నమూనాలు ఉన్నాయి. ప్రస్తుతం అపాచీ హెలికాప్టర్లను (US Apache helicopter) వారు రీ ఇంజినీరింగ్ చేస్తున్నారు. వాటి విడిభాగాలను అధ్యయనం చేస్తున్నారు. అతి త్వరలోనే వారు తక్కువ డబ్బుతోనే అత్యుత్తమమైన హెలికాప్టర్లను నిర్మిస్తారు." (US Apache helicopter kabul)
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు
మూడు శాతం మందే అర్హులు..
ఇటీవల అఫ్గాన్ నుంచి అమెరికాకు తరలించినవారిలో కేవలం మూడు శాతం మంది మాత్రమే ఇక్కడికి వచ్చేందుకు అర్హులని ట్రంప్ పేర్కొన్నారు. అసలు ఆ తరలింపు విమానాల్లో ఎవరెక్కుతున్నారో కూడా బలగాలకు తెలియలేదని అన్నారు.
అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ తీరుపై మొదటినుంచి జో బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ట్రంప్.. ఈ ప్రక్రియ చాలా అసమర్థంగా జరిగిందని పలుమార్లు ఆరోపించారు. ఇలాంటి దారుణమైన ఉపసంహరణ ప్రక్రియను చరిత్రలో ఏ యుద్ధంలోనూ చూడలేదంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: ట్రంప్ తీసుకున్న ఆ నిర్ణయంతో ఆందోళనలో చైనా!