జమ్ముకశ్మీర్ ప్రజల హక్కుల పరిరక్షణకు చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆ దేశ చట్టసభ్యులు కొందరు కోరారు. కశ్మీర్లో టెలికాం సేవలపై ఉన్న ఆంక్షలను పూర్తిగా తొలగించి.. ఆర్టికల్ 370 రద్దు అనంతరం నిర్బంధించిన ప్రజలను విడుదల చేసే దిశగా భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్‌ను అభ్యర్థించారు.
కశ్మీర్లో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయని సెనేటర్ క్రిస్ వాన్ హోల్లెన్, టాడ్ యంగ్, బెన్ కార్డిన్, లిండ్సే గ్రాహమ్ లేఖలో పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో దశాబ్దాలుగా ఉన్న విధానాల్లో భారీ మార్పులు జరిగాయని మరో సెనేటర్ బాబ్ కాసీ అభిప్రాయపడ్డారు. దీని వల్ల భారత్-పాక్ మధ్య ఉన్న విభేదాలు మరింత పెరుగుతాయన్నారు.
తన భూభాగంలో కార్యకలాపాలను సాగిస్తున్న ఉగ్రవాదులను పాకిస్థాన్ అంతం చేయాలని లేఖలో పేర్కొన్నారు చట్టసభ్యులు. కశ్మీర్ లక్ష్యంగా అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వారిపైనా పాక్ కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
జమ్ముకశ్మీర్... తమ అంతర్గత వ్యవహారమని, మూడో పక్షం జోక్యానికి తావు లేదని భారత్ ఇప్పటికి అనేకసార్లు స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ డొనాల్డ్ ట్రంప్‌కు నేరుగా చెప్పారు.
ఇదీ చూడండి:- 'కశ్మీర్ మా అంతర్గత విషయం..పాక్ జోక్యం అనవసరం'