వియన్నా వేదికగా.. అణుఒప్పందంపై ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించడం అంత సులభం కాదని అగ్రరాజ్యం భావిస్తోంది. మున్ముందు చర్చలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కానీ ఇరు దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరించేందుకు ఇదొక ముందడుగు అని పేర్కొంది.
చర్చలు ముగిసే సమయానికి ఇరు పక్షాలకు సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. మంగళవారం ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో అమెరికా ఈ ప్రకటన చేసింది.
ఐరోపా మధ్యవర్తిత్వం..
అణు ఒప్పందం నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా వైదొలిగినప్పటి నుంచి ఇరాన్ అణు కార్యకలాపాలను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తోంది. దీనిని పరిమితం చేసేందుకు అమెరికా మళ్లీ ఇరాన్‌తో చర్చలకు సిద్ధమైంది. అమెరికాతో నేరుగా చర్చించేందుకు ఇరాన్ తిరస్కరించడం వల్లే ఐరోపా సమాఖ్య మధ్యవర్తిత్వంలో ఇరు దేశాలు చర్చల్లో పాల్గొంటున్నాయని అగ్రరాజ్యం తన ప్రకటనలో పేర్కొంది. ఈ చర్చల్లో భాగంగా యూకే, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాకు చెందిన దౌత్యవేత్తలు కూడా హాజరయ్యారు.
ఇదీ చదవండి : 'విదేశాలకు భారత టీకా సరఫరాపై కరోనా ఎఫెక్ట్'