అణ్వాయుధ సంపత్తి, నిల్వల వివరాలను ప్రకటించకూడదని అమెరికా నిర్ణయించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం ప్రస్తుతం తమ దేశం వద్ద ఉన్న అణ్వాయుధాల వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది. ఇందుకు కారణాలు మాత్రం చెప్పలేదు. అణ్వాయుధాల అంశంపై అధ్యయనం చేసే ప్రైవేటు బృందమైన అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్యకు... శక్తి ఉత్పాదక విభాగం రాసిన లేఖలో ఈ విషయం స్పష్టంచేసింది. జాతీయ భద్రతపై ఈ సంస్థ ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఉంటుంది.
2010లో మొదలు
2010లో చరిత్రలో మొదటిసారిగా అణ్వాయుధాల లెక్కను ప్రకటించింది అప్పటి బరాక్ ఒబామా ప్రభుత్వం. 1945 నుంచి అప్పటివరకు ఎన్ని ఉన్నాయో వెల్లడించింది.
2009 సెప్టెంబర్ 30 వరకు దాదాపు 5,113 'అణు వార్‌హెడ్'లు ఉన్నట్టు అమెరికా ప్రకటించింది. 1967లో 31,255 ఉన్నట్టు చెప్పింది. అప్పటితో పోలిస్తే 2009కి దాదాపు 84శాతం తగ్గాయి.
2017 సెప్టెంబర్ 30 నాటికి 3,822 అణు వార్హెడ్లు ఉన్నట్టు వెల్లడించింది ట్రంప్ ప్రభుత్వం. 2015 కంటే 196 తగ్గినట్టు చెప్పింది.
2018కి సంబంధించిన అణ్వాయుధాల వివరాలు ప్రకటించాలని కొందరు శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
" చాలా విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత... వివరాలను ఈసారి వెల్లడించకూడదని నిర్ణయించుకున్నాం" అని ఈ నెల 5న శాస్త్రవేత్తల సమాఖ్యకు రాసిన లేఖలో అమెరికా అణుశక్తి విభాగం తెలిపింది. ఇందుకు ఎటువంటి కారణాలను చెప్పలేదు.
అసలు అణు సంపత్తిని వెల్లడించడం అనవసరమని, అది దేశానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుందని అణు సమాచార ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.క్రిస్టెన్సన్ తెలిపారు.