భారత్‌కు సాయం అందించేందుకు అమెరికా అన్ని విధాలుగా కృషిచేస్తోందని అన్నారు ఆ దేశ విదేశాంగ శాఖ అధికారులు. గత వారంలో భారత్‌కు అమెరికా ఆరు విమానాలలో వైద్య పరికరాలు, మందులను పంపించిందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల సలహాదారు ఎర్విన్ మస్సింగా వెల్లడించారు.
"గత 26ఏళ్లలో అమెరికా ఈ స్థాయిలో సాయం అందించడం నేను ఎప్పుడూ చూడలేదు. ప్రైవేటు రంగం, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఇలా అందరూ భారత్‌కు అండగా ఉండేందుకు కృషి చేస్తున్నారు. భారత్‌లో పరిస్థితిపై విదేశాంగ మంత్రి టోనీ బ్లింకన్ సహా సీనియర్ అధికారులు భారత అధికారులను సంప్రదించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు."
-ఎర్విన్ మస్సింగా, దక్షిణ ఆసియా వ్యవహారాల సలహాదారు
భారత్ పరిస్థితులపై అమెరికా తక్షణమే స్పందించిందని యూఎస్ ఎయిడ్ ఆసియా డెప్యూటీ అసిస్టేంట్ అడ్మినిస్ట్రేటర్ అంజలీ కౌర్ అన్నారు. ఆక్సిజన్ సంబంధిత వనరుల కొరతపై భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేయగానే అమెరికా 1000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కొనుగోలుకు నిధులు మంజూరు చేసిందన్నారు. వీటితో పాటు భారత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న 150 ప్రెజర్ స్వింగ్ అబ్సార్ప్షన్ ఆక్సిజన్ జెనరేటింగ్ ప్లాంట్స్‌కు సహాయం అందిస్తోందని పేర్కొన్నారు.
నిధులకు పిలుపు...
భారత్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. తక్షణమే దేశానికి సాయం అందిచేందుకు నిధులు సమకూర్చాలని అమెరికా చట్టసభ్యురాలు ప్రమీలా జయపాల్ పిలుపునిచ్చారు. భారత్‌ను ఆదుకోవడం అమెరికా నైతిక బాధ్యతన్నారు. విష్ ఫౌండేషన్, గివ్ ఇండియా, ఎడేల్గివ్ ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూరుస్తున్నట్లు వెల్లడించారు.
భారతీయ అమెరికన్ ఫిజీషియన్స్ సాయం..
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫిజీషియన్స్ అసోసియేషన్ (ఎఫ్ఐపీఏ) ద్వారా భారత్‌కు 5000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను భారతీయ అమెరికన్ ఫిజీషియన్లు విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే వీటిలో 450 యూనిట్లు అహ్మదాబాద్ చేరాయని.. మరో 325 యూనిట్లు దిల్లీకి, 300 యూనిట్లు ముంబయికి త్వరలో చేరుతాయని స్పష్టం చేశారు. మరో 3500 యూనిట్లను త్వరలో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : చైనా సినోఫామ్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి