భారత్‌లోని ఆరోగ్య కార్యకర్తలకు వైద్య పరికరాలను అందించాలని పెంటగాన్(అమెరికా రక్షణ విభాగం)ను ఆదేశించారు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్. రెండో దశ కరోనా విజృంభణపై పోరాటం చేస్తున్న వారికి సహకారం అందించేందుకు తమ వద్ద ఉన్న అన్ని వనరులను ఉపయోగించాలని పేర్కొన్నారు.
"భారత్‌లో కరోనా ఉద్ధృతి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను. భారత్‌లో ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు వైద్య పరికరాలు అందించడానికి అమెరికా చేస్తున్న కృషికి సహకారంగా మా పరిధిలో, మా వద్ద ఉన్న అన్ని వనరులను ఉపయోగించాలని రక్షణ విభాగాన్ని ఆదేశించాను"
-లాయిడ్ ఆస్టిన్, అమెరికా రక్షణ మంత్రి
రాబోయే కొద్ది రోజుల్లో ఆక్సిజన్ సంబంధిత పరికరాలు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, వ్యక్తిగత పరిరక్షణ పరికరాలను భారత్‌కు తరలించడంలో రవాణా సదుపాయాలను అందించనున్నట్లు ఆస్టిన్ తెలిపారు. మహమ్మారిపై పోరులో భారత్‌కు దన్నుగా నిలవడానికి అమెరికాలోని ఇతర విభాగాలతో సమన్వయం చేసుకొని పనిచేయనున్నట్లు చెప్పారు.
5 టన్నుల ఆక్సిజన్..
అమెరికా నుంచి సాయంలో భాగంగా.. 300కు పైగా ఆక్సిజన్ మిషన్లు న్యూయార్క్ నుంచి ఆదివారం ఉదయం భారత్‌కు బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు. 5 టన్నుల ఈ ఆక్సిజన్‌ను ఎయిర్ఇండియా రవాణా చేస్తోంది. సోమవారం మధ్యాహ్నానికల్లా అవి భారత్‌కు చేరుకోనున్నాయి.
ఇదీ చూడండి: 'భారత్‌కు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నాం'