అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వచ్చే వారం భారత పర్యటనకు రానున్నారు. తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా భారత్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా దేశాలకూ వెళ్లనున్నారని అగ్రరాజ్య రక్షణ విభాగం-పెంటగాన్ ప్రకటించింది. అమెరికా రక్షణ మంత్రి తొలి విదేశీ పర్యటనలో భారత్‌ను చేర్చటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.
"ఈ పర్యటనలో ఆస్టిన్.. ఆయా దేశాల రక్షణ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. అంతర్జాతీయ రక్షణ సంబంధాలు, అంతర్జాతీయ నిబంధనలు, చట్టాలను అనుసరించి ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి కోసం అమెరికా లక్ష్యాలపై చర్చించనున్నారు. మార్చి 13న ప్రారంభం కానున్న ఈ పర్యటనలో ముందుగా హువాయ్‌లోని అమెరికాకు చెందిన ఇండో-పసిఫిక్ కమాండ్ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. ఆ తర్వాత ఆయా దేశాల్లో పర్యటిస్తారు. "
- పెంటగాన్
చివరగా భారత్‌కు!
13నే పర్యటన ప్రారంభమవుతున్నప్పటికీ.. భారత్‌కు ఎప్పుడు వస్తారనేది ప్రకటించలేదు పెంటగాన్. అయితే.. జపాన్, దక్షిణ కొరియా తర్వాత భారత పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర సీనియర్ అధికారులతో.. అమెరికా-భారత్ రక్షణ భాగస్వామ్యం, ఇండో-పసిఫిక్, పశ్చిమ హిందూ మహాసముద్ర ప్రాంతం అభివృద్ధి, శాంతియుత పరిస్థితుల కల్పనపై చర్చించనున్నట్లు పెంటగాన్ తెలిపింది.
ఇదీ చూడండి: 'అమెరికాకు భారత్ కీలక రక్షణ భాగస్వామి'