US daily Covid cases: అమెరికాలో రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4,41,278 కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయని అంటువ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) వెల్లడించింది. డిసెంబర్ 25తో ముగిసిన వారంలో నమోదైన కొత్త ఇన్ఫెక్షన్లలో 58.6 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని తెలిపింది. ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు 11 శాతం పెరిగాయని వివరించింది. ఏడు రోజుల సగటు కేసుల సంఖ్య 2.4 లక్షలుగా ఉందని ది హిల్ వార్తా పత్రిక పేర్కొంది.
US Omicron variant news
ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ముప్పు అధికంగానే ఉందని సీడీసీ అభిప్రాయపడింది. యూకే, దక్షిణాఫ్రికా, డెన్మార్ దేశాల నుంచి వచ్చిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి.. ఆస్పత్రిలో చేరే ముప్పు తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది.
కాలిఫోర్నియాలో ఇప్పటివరకు 50లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇన్ని కేసులు వచ్చిన తొలి రాష్ట్రంగా అవతరించింది. ఒక్క కాలిఫోర్నియాలోనే 75 వేల 500 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.
US flights delay
మరోవైపు, ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా మంగళవారం 2,969 విమానాలు రద్దయ్యాయి. 11,500 వాయిదా పడ్డాయి. అమెరికాలోనే ఏకంగా 1,172 విమానాలు రద్దయ్యాయని... 5,458 విమానాలు వాయిదా పడ్డాయని 'ఫ్లైట్అవేర్' అనే వెబ్సైట్ వెల్లడించింది.
సోమవారం సైతం భారీగా విమానాలు నిలిచిపోయాయి. 'ఫ్లైట్రాడార్24' వెబ్సైట్ ప్రకారం 2,959 విమానాలు రద్దు కాగా.. 12,528 విమానాలు ఆలస్యంగా నడిచాయి.
ఈ దేశాల్లోనూ..
చైనా, ఇండోనేసియా, స్పెయిన్ దేశాలలోనూ కరోనా తీవ్రంగా ఉంది. ఆయా దేశాల్లో నమోదైన కరోనా కేసుల వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: కార్లలో కరోనా పరీక్షలకు.. ఆస్పత్రుల వద్ద భారీ క్యూ