అమెరికాలో ఇప్పటి వరకు 16 లక్షల కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అగ్రరాజ్యంలో మృతుల సంఖ్య 10 వేల మార్క్‌ను చేరుకోబోతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ట్రంప్ హెచ్చరించారు. ప్రతిఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని.. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. దేశంలో దాదాపు 95 శాతం జనాభాకు ఇంటికే పరిమితం కావాలన్న నిబంధనలు వర్తిస్తాయని గుర్తుచేశారు.
కరోనా వైరస్‌తో అమెరికాలో మృతుల సంఖ్య 9,618కు చేరింది. 9/11 ఉగ్రదాడిలో చనిపోయిన వారితో పోలిస్తే ఇది మూడింతలు. ఆదివారం ఒక్కరోజే 1,165 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా దాదాపు 25,316 మందిలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఫలితంగా వైరస్ బారినపడ్డవారి సంఖ్య 3,36,830కి చేరింది.
![US Corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6680901_li.jpg)
29 లక్షల డోసుల హైడ్రాక్సీక్లోరోక్విన్
అమెరికాలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నందున వైరస్ కట్టడి చర్యల్ని వివరించారు ట్రంప్. ప్రపంచదేశాల నుంచి మాస్కులు, చేతి తొడుగులు, ఇతర రక్షక సాధనాలను తెప్పించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో తాజా సంక్షోభాన్ని భారీ విపత్తుగా ప్రకటించారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉపయోగాన్ని మరోసారి ధ్రువీకరించిన ట్రంప్.. దాదాపు 29 లక్షల డోసుల ఔషధాన్ని తెప్పించినట్లు వెల్లడించారు. రానున్న రెండు వారాలు అత్యంత కఠినంగా గడవనున్నాయని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు.
ఇదీ చూడండి : కరోనా నుంచి కోలుకోని బ్రిటన్ పీఎం- ఆసుపత్రికి తరలింపు